హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే రైతులపైనే విద్యుత్తు భారం పడనున్నది. ఈ మేరకు టీఎస్ రెడ్కో మరో నిబంధన విధించింది. రైతులు తమ స్థలాల్లో ఏర్పాటు చేసుకునే సోలార్ విద్యుత్తు ప్లాంట్లకు హెచ్‌టీ విద్యుత్తు కనెక్షన్ తీసుకోవాలని టీజీ రెడ్కో అధికారులు నిబంధన పెట్టారు. పరిశ్రమలకిచ్చే హెచ్‌టీ కనెక్షన్‌ను తీసుకోవాలంటూ షరతు పెట్టారు. దీంతో ప్లాంట్ పెట్టిన రైతులకు ఉచిత విద్యుత్తు కనెక్షన్ పోయినట్టే. రైతుభరోసా సాయమూ అందదు.
ఈ హెచ్‌టీ కనెక్షన్‌తో ఒక్కో రైతుకు నెలకు రూ.50 వేల వరకు విద్యుత్తు బిల్లుగా చెల్లించాల్సిందే. సోలార్ ప్లాంట్లకు హెచ్‌టీ విద్యుత్తు కనెక్షన్ తీసుకోవాలన్న నిబంధనను రైతులు తీవ్రం గా వ్యతిరేకిస్తున్నారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లలో పొందుపరిచిన మూడు నిబంధనలనూ మార్చాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. పీఎం కుసుమ్ స్కీం కింద రైతులు తమ పొ లాల్లో 2 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నది.
రైతులు 0.5 మెగావాట్ నుంచి 2 మోగావాట్ల వరకు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఇప్పటివరకు 1,800 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు రైతులు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) చెల్లించారు. ఈఎండీ చెల్లించిన వారితో డిస్కంలు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు (పీపీఏ) కుదుర్చుకోవాల్సి ఉన్నది. ఈ పీపీఏలను బట్టే బ్యాంకులు రుణాలను మంజూరుచేస్తాయి. రుణాలు పొందాక ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. రైతులతో పీపీఏలు కుదుర్చుకునేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఆది, సోమవారాల్లో పీపీఏ ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు రావాలంటూ టీజీ రెడ్కో అధికారులు లబ్ధిదారులైన రైతులకు సమాచారం ఇచ్చారు.
సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే రైతులు 70 కిలోవాట్ (హెచ్‌టీ) కనెక్షన్ తీసుకోవాలి. ఒక్కో వినియోగదారుడు ఒక కేవీఏకు రూ.475 డిమాండ్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.33 వేలకు పైగా చెల్లించాలి. విద్యుత్తు చార్జీల కింద కనీసంగా నెలకు రూ.18 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ మొత్తం రూ.50 వేలు అవుతుంది. వాస్తవానికి బోరుబావి, మోటర్, లైట్, ఫ్యాన్లు వాడేవారికి 10 కేవీఏ వరకు సరిపోతుంది. కానీ బలవంతంగా 70 కేవీఏ హెచ్‌టీ కనెక్షన్ కట్టబెడుతున్నారు. అంటే నెలకు రూ.50 వేల చొప్పున ఏటా రూ.6లక్షలు డిస్కంలకు రైతులు చెల్లించాలి. ఇది రైతులకు పెనుభారం కానున్నది.
సోలార్ ప్లాంట్‌లో జనరేషన్ కెపాసిటీ యుటిలైజేషన్ ఫ్యాక్టర్ 19 శాతంగా ఉండాలని నిర్ణయించారు. అంతకు 10 శాతం ఎక్కువ విద్యుత్తు జనరేట్ అయితే డిస్కం బిల్లులు చెల్లించదు. 10 శాతం కంటే తక్కువ విద్యుత్తు ఉత్పత్తి అయితే మాత్రం పెనాల్టీ విధిస్తామని మెలిక పెట్టారు. ఉదాహరణకు 100 యూనిట్ల ప్లాంట్లు 110 యూనిట్ల విద్యుత్తు జనరేట్ చేస్తే అంతవరకు డిస్కం చార్జీలు చెల్లిస్తుంది. ఒకవేళ 120 యూనిట్లు జనరేట్ చేస్తే 10 యూనిట్లకు బిల్లు చెల్లించరు. కేవలం 110 యూనిట్లకే చెల్లిస్తారు. అదే ఒకవేళ 100 యూనిట్ల ప్లాంట్ 90 యూనిట్లు జనరేట్ చేస్తే పెనాల్టీ విధిస్తారు. ఇది రైతుల పాలిట శాపంగా మారనున్నది.
సోలార్ విద్యుత్తుకు రెఫరల్ వోల్టేట్ (థర్మల్, హైడల్) తప్పనిసరి. రెఫరల్ వోల్టేజ్ లేకపోతే సోలార్ విద్యుత్తు జనరేట్ అయినా నిరుపయోగమే. ఒకవేళ గంటల తరబడి బ్రేక్‌డౌన్స్, విద్యుత్తు కోతలుంటే సోలార్ ఉత్పత్తి అయినా డిస్కంలు తీసుకోలేవు. దీంతో రైతులకు తీవ్ర నష్టం కలగనుంది. ఇలా కలిగే నష్టానికి డిస్కంలు పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వశాఖ మాడల్ పీపీఏ క్లాస్ 4.9లో జనరేషన్ కాంపెన్సేషన్ క్లాజు ఉన్నదని. దీనిని చేర్చి, పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఉచిత విద్యుత్తు కనెక్షన్, రైతు భరోసాకు కోతపెట్టడం, హెచ్‌టీ కనెక్షన్లు జారీచేయడం, యుటిలైజేషన్ ఫ్యాక్టర్, రెఫరల్ వోల్టేజ్ వంటి సమస్యల నేపథ్యంలో పీపీఏ పట్ల లబ్ధిదారులైన రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. అసలు పీపీఏల్లో ఏమున్నదో, ఏ నిబంధనలు పెట్టారో? నిరక్షరాస్యులైన రైతులకు తెలియదు. కానీ 50-60 పేజీలపై సంతకాలు పెట్టించుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఒక్కసారి పీపీఏలు కుదరిన తర్వాత మార్పులు చేయడం అసాధ్యం. 25 ఏండ్లపాటు ఇదే అగ్రిమెంట్ కొనసాగుతుంది. ఈ తరుణంలో ఒప్పందంపై సంతకాలు చేయాలా? వద్దా? అన్న మీమాంసలో రైతులు ఉన్నారు.
పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లలో పొందుపరిచిన షరతులతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఇదే విషయంపై రైతులంతా ఆందోళనలో ఉన్నారు. మేమే కూడా పలుమార్లు అధికారులను కలిసి వినతిపత్రాలు ఇచ్చాం. నిబంధనలు మార్చాలని కోరాం. అయినా టీజీ రెడ్కో, డిస్కం అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు.
– బుర్రా అశోక్‌కుమార్, తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు