హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘క్యాష్ బీన్’ అనే చైనీస్ యాప్ మోసం కేసులో ఈడీ అధికారులు పురోగతి సాధించారు. హైదరాబాద్ జోన్కు చెందిన ఈడీ అధికారులు పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (పీసీఎఫ్ఎస్) కంపెనీకి చెందిన రూ.252.36 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు గురువారం తెలిపారు. పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ మొత్తం చైనీస్ నియంత్రణలోనే ఉన్నట్టు ఫెమా పరిశోధనలో వెల్లడైందని వివరించారు.
గతంలో వీరు ‘క్యాష్ బీన్’ అనే లోన్ యాప్ ద్వారా ప్రజలకు అప్పులు ఇచ్చారు. ఫెమా నిబంధనలు ఉల్లింఘించి అధిక వడ్డీలు, ఇతర చార్జీలను వసూలు చేస్తూ.. రూ.429.30 కోట్లను అక్రమంగా విదేశాలకు పంపినట్టు ఈడీ గుర్తించింది. ఓవర్సీస్ గ్రూప్ కంపెనీలకు సాఫ్ట్వేర్ లైసెన్స్లు, సేవల దిగుమతి పేరుతో పీసీఎఫ్ఎస్ బోగస్ కంపెనీలను సృష్టించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.
దీంతో పీసీఎఫ్ఎస్కు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడంలో ఈడీ నిమగ్నమైంది. విడతల వారీగా మొత్తం మూడు ఆర్డర్లతో రూ.252.36 కోట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. విచారణలో ఆర్బీఐ, సీబీఐ లోగోలను అనధికారికంగా ఉపయోగించినట్టు తేలింది. ఈ భారీ మోసానికి అదనంగా రూ.2,146 కోట్ల జరిమానా విధించింది.