హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పట్ల కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ చూపుతున్న వివక్ష మరోసారి బట్టబయలైంది. కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి మొండిచేయి చూపింది. రాష్ట్ర విభజన హామీలను పూర్తిగా విస్మరించింది. తెలంగాణలో 12 శాఖలకు సంబంధించిన 47 ప్రాజెక్టులకు బడ్జెట్లో చుక్కెదురైంది. రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్), రేడియల్ రోడ్లు, ఇతర రహదారుల ప్రాజెక్టులకు అనుమతులిచ్చి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు కేంద్రాన్ని కోరినా ఫలితం లేకుండా పోయింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల పర్యావరణ వ్యవస్థలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్‌కు సెమీకండక్టర్ ప్రాజెక్టు మంజూరు చేయాలని పదేపదే కోరినా కేంద్రం కనికరించలేదు.
దేశంలోని 7 మెట్రో నగరాలను అనుసంధానించేందుకు ఉద్దేశించిన హైస్పీడ్ రైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులో హైదరాబాద్‌ను చేర్చడం మినహా తెలంగాణలోని ఏ ఒక్క ప్రాజెక్టుకూ కేంద్ర బడ్జెట్లో చోటు లభించలేదు. ట్రిపుల్ఆర్ ఉత్తర, దక్షిణ భాగాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంతోపాటు రూ.34,367.62 కోట్లు మంజూరు చేయాలని, ట్రిపుల్ఆర్ను హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)తో కలిపేందుకు ఉద్దేశించిన 10 రేడియల్ రోడ్ల నిర్మాణానికి రూ.45 వేల కోట్లు మంజూరు చేయాలన్న రాష్ట్ర సర్కార్ విన్నపాలను కేంద్రం పట్టించుకోలేదు.
తెలంగాణలో పెరిగిన ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయడంతోపాటు హైదరాబాద్-బెంగళూరు మార్గంలో ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఉద్దేశించిన హైదరాబాద్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని, హైదరాబాద్-విజయవాడ నగరాలను కలిపే ఎన్‌హెచ్-65 రహదారిని 6 లేన్లుగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు ఎంతోకాలంగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వాటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్‌సిటీలో ఉత్పత్తయ్యే వస్తువులను నేరుగా సముద్రమార్గం ద్వారా ఎగుమతి చేసేందుకు వీలుగా ఫ్యూచర్‌సిటీ నుంచి ఏపీలోని బందరు పోర్టుకు గ్రీన్‌ఫీల్డ్ హైవేను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కూడా కేంద్ర బడ్జెట్లో చుక్కెదురైంది.
డొమెస్టిక్ ఎయిర్ కనెక్టివిటీని అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ‘ఉడాన్’ పథకం కింద వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, బసంత్‌నగర్ (రామగుండం)లో విమానాశ్రయాలు నిర్మించాలని, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను కలిపేందుకు 8 కొత్త రైల్వే లైన్లు నిర్మించాలని కోరినా కేంద్ర బడ్జెట్లో మోదీ సర్కార్ మొండిచెయ్యి చూపింది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగపడే హైదరాబాద్ మెట్రోరైలు ఫేజ్-2, ఫేజ్-2ఏ, ఫేజ్-2బీ ప్రాజెక్టుకు అనుమతులిచ్చి, రూ.44 వేల కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతోపాటు ఈ ప్రాజెక్టు వ్యయంలో సగభాగాన్ని భరిస్తామని ప్రతిపాదించినా కేంద్రం కనికరించలేదు.
తెలంగాణకు 6 విద్యుత్తు ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు (పవర్ సిస్టమ్ డెవలప్మెంట్ ఫండ్) మంజూరు చేయాలని, వాటి ఏర్పాటుకు రూ.281.6 కోట్లు ఇవ్వాలని, సింగరేణి తాడిచర్ల కోల్ బ్లాక్-2కు మైనింగ్ లీజు అనుమతులు మంజూరు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపాలకు కేంద్ర బడ్జెట్లో స్థానం దక్కలేదు. సింగరేణి ఆధ్వర్యంలో వచ్చే ఐదేండ్లలో 7 కొత్త బొగ్గు గనులు ప్రారంభించేందుకు అటవీ, పర్యావరణ, ఇతర అనుమతులు మంజూరు చేయాలన్న ప్రతిపాదనలను మోదీ సర్కార్ పట్టించుకోలేదు. ఆదిలాబాద్‌లో ఖాయిలాపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను పునరుద్ధరించడం ద్వారా తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌పై కేంద్రం స్పందించలేదు.
వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుకు రూ.4,170 కోట్లు, ‘అమృత్-2.0’ పథకం కింద హైదరాబాద్ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ అమలు కోసం రూ.17,212.69 కోట్లు మంజూరు చేయడంతోపాటు మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు, బాపూఘాట్ అభివృద్ధికి 60% గ్రాంట్ ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్రం కనీసం దృష్టి కూడా సారించలేదు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరాల్లో మౌలిక సదుపాయల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేస్తున్నట్టు కేంద్రం గొప్పలు చెప్తున్న మోదీ సర్కార్.. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్, వరంగల్ నగరాలను పూర్తిగా విస్మరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ) : తెలంగాణకు ఎన్డీఏ సర్కారు మళ్లీ అన్యాయమే చేసింది. కేంద్ర బడ్జెట్లో మొండిచెయ్యి చూపింది. కానీ పొరుగు రాష్ట్రం ఏపీపై వరాలు కురిపించింది. ఏపీ పునర్వవస్థీకరణ చట్టం ప్రకారం కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏపీకి రూ. 15వేల కోట్ల ఆర్థిక సహాయాన్ని బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. బహుపాక్షిక అభివృద్ధి సంస్థల ద్వారా ఈ పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించింది. కానీ తెలంగాణకు ప్రత్యేకంగా రూపాయి కూడా ప్రత్యేకంగా కేటాయించకపోవడం గమనార్హం. విభజన హామీల విషయంలో ఇప్పటికే తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్న కేంద్రం, తాజా బడ్జెట్లోనూ తీవ్ర వివక్షను ప్రదర్శించింది.
క్రిటికల్ మినరల్స్ కారిడార్‌ను సైతం కేంద్రం ఏపీకి మంజూరు చేసింది. ఈ రంగంలో సింగరేణి సంస్థ ఇప్పటికే అడుగుపెట్టింది. కానీ ఈ కారిడార్‌లో రాష్ర్టానికి చోటు కల్పించలేదు. ఇక రాష్ర్టానికి ప్రకటించిన హైస్పీడ్ రైలు అనుసంధాన ప్రాజెక్ట్ ఏపీకే అనుకూలంగా ఉండనున్నది. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై కారిడార్లు అత్యధిక మార్గం ఏపీ నుంచే వెళ్లనున్నాయి. హైదరాబాద్ పుణెకు వెళ్లే రైల్వే కారిడార్‌తో కర్ణాటక, మహారాష్ట్రలే ఎక్కువగా లాభం పొందనున్నాయి. ఈ మార్గంలో తెలంగాణ వ్యవధి 200 కిలోమీటర్లేనని నిపుణులు చెబుతున్నారు.