హైదరాబాద్ : హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు శుక్రవారం ఉదయం శ్రీవారికి నిర్వహించిన సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, అర్చన, నివేదన, శాత్తుమొర, అభిషేకసేవతో భక్తులు పులకించిపోయారు.
ప్రతి శుక్రవారం తెల్లవారుజామున తిరుమలలో నిర్వహించినట్లుగానే శ్రీస్వామివారి వక్షఃస్థలంలో ‘ బంగారు అలమేలుమంగ’ ప్రతిమకు పునుగు, కస్తూరి, జవ్వాది తదితర సుగంధ పరిమళాలతో కూడిన పవిత్రజలాలతో సుమారు గంట పాటు అభిషేకం చేశారు. అనంతరం పసుపుతో శ్రీవారి వక్షఃస్థలంలో ఉన్న మహాలక్ష్మికి కూడా అభిషేకం చేశారు. అనంతరం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిజపాదదర్శనం కల్పించారు.
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తులరే శ్రీ వేంకటేశ సుప్రభాతం, గోవిందనామాలను పుస్తకాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు, బోర్డు సభ్యులు భక్తులు పాల్గొన్నారు.