గుడిహత్నూర్,అక్టోబరు 31: మరో పది నిమిషాల్లో ఇల్లు చేరాల్సిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుర్ని, ఓ డ్రైవర్ను రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగోంది సమీపంలోని మూలమలుపు వద్ద ఆదివారం అర్ధరాత్రి ఓ కారును వెనుక నుంచి అతివేగంతో లారీ ఢీకొన్నది. దాంతో నలుగురు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకెళ్లితే.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం మసూద్ కాలనీకి చెందిన సయ్యద్ రఫతుల్లా అహ్మద్ తన చిన్న కూతురు పెండ్లి షాపింగ్ కోసం కుటుంబసభ్యులతో కలిసి ఎర్టిగా కారులో హైదరాబాద్ వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో ఆదిలాబాద్ వస్తుండగా గుడిహత్నూర్ సమీపంలోని మేకలగండి మూలమలుపు వద్దకు రాగానే వీరి కారును లారీ వెనుక నుంచి అతివేగంతో ఢీకొన్నది. దాంతో ఆ కారు కంటైనర్ కిందికి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో సయ్యద్ రఫతుల్లా అహ్మద్ (56), ఆయన కూతురు శబియా హష్మి (26), తమ్ముడి కొడుకు సయ్యద్ వహజాద్ (17), కారు డ్రైవర్ శంషోద్దీన్(50) మృతి చెందారు. మరో కూతురు జుబియా హష్మికి తీవ్రగాయాలుకాగా, స్థానిక రిమ్స్ దవాఖానకు తరలించారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.