హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న టెలికాం సెటప్‌పై హైదరాబాద్‌లోని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం యూనిట్ దాడి చేసింది. చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న టెలికం సెంటర్‌పై సోదాలు చేసి సెషన్ ఇనిషియేషన్ ప్రొటోకాల్ (ఎస్ఐపీ) కనెక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి అక్రమ కనెక్షన్లపై నిఘా పెట్టిన హైదాబాద్ డీవోటీ.. పోలీసుల సాయంతో ఈ రాకెట్‌ను ఛేదించింది. ఎస్ఐపీ సర్వర్, మూడు ల్యాప్‌టాప్‌లు, ఒక మానిటర్, సంబంధిత నెట్వర్క్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఎస్ఐపీ వ్యవస్థ ద్వారా విదేశాల నుంచి భారతీయ కస్టమర్లకు అంతర్జాతీయ కాల్స్‌ను అక్రమమార్గంలో మళ్లిస్తున్నట్టు టెలికాం అధికారులు గుర్తించారు. విదేశాల నుంచి వచ్చే సైబర్ కాల్స్‌ను ఇండియన్ నంబర్లుగా చూపించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వీటిని ఉపయోగించుకొని కొన్ని అసాంఘిక శక్తులు చట్టవిరుద్ధమైన పనులకు ఈ సాంకేతికతను ఉపయోగిస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ దాడుల్లో ఒకరిని అరెస్టు చేసి, సంస్థపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు టెలికం అధికారులు తెలిపారు. ఈ కేసులో డేటా విశ్లేషణతోపాటు, మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.