హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): వైద్య వృత్తి నుంచి ‘జూనియర్’ అనే పదాన్ని తొలిగించాలని జూనియర్ డాక్టర్లను ఇకపై ‘డాక్టర్’ అని మాత్రమే సంబోధించాలని బ్రిటిష్ ఇంటర్నేషనల్ డాక్టర్స్ అసోసియేషన్ (బీఐడీఏ) నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ యువకుడు డాక్టర్ సాయిరాం పిల్లరిశెట్టి తీవ్ర కృషి ఫలితంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. బీఐడీఏ గతంలో బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ (బీఎంఏ)గా ఉండేది. ఈ అసోసియేషన్‌కు సుమారు 200 ఏండ్ల చరిత్ర ఉన్నది. ఇది 1832లో మొదలైంది. బ్రిటన్‌లోనే అతి పురాతన, అతిపెద్ద గుర్తింపు పొందిన వైద్యుల సంఘం. ఇందులో సుమారు 1.73 లక్షల మంది డాక్టర్లు సభ్యులుగా ఉన్నారు. ఇటీవలే బ్రిటన్‌లోని లివర్‌పూల్‌లో బీఐడీఏ 191వ వార్షికోత్సవం నిర్వహించారు. ఇందులో డాక్టర్ సాయిరాం చేసిన ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీఐడీఏ తెలిపింది.
సమావేశంలో డాక్టర్ సాయిరాం మాట్లాడుతూ.. దాదాపు పదేండ్ల అనుభవం ఉన్న వైద్యులను కూడా జూనియర్ డాక్టర్లుగా పిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ అనే పదం ఆ వైద్యుడి సామర్థ్యాన్ని, నిపుణతను, అందిస్తున్న సేవలను అవమానించేలా ఉన్నాయని పేర్కొన్నారు. జూనియర్ అనే పదాన్ని తొలిగించి వారి అర్హతలను బట్టి గ్రేడ్లతో పిలవాలని కోరారు. సాయిరాం ప్రసంగంతో సమావేశానికి హాజరైనవారంతా నిలబడి చప్పట్లు కొట్టి అభినందించారని బీఐడీఏ వెల్లడించింది. సాయిరాం విజ్ఞప్తి మేరకు జూనియర్ అనే పదాన్ని తొలిగించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆ సంస్థ స్పష్టంచేసింది. సాయిరాం ప్రస్తుతం డాక్టర్‌గా విధులు నిర్వహిస్తుండటంతో పాటు బీఐడీఏ అనుబంధ శాఖ అయిన డాక్టర్స్-ఇన్-ట్రెయినింగ్ ఫోరం చైర్మన్‌గా కూడా కొనసాగుతున్నారు. దీనిని 1975వ సంవత్సరంలో దానిని నెలకొల్పారు. వివిధ ఇతర దేశాల నుంచి వచ్చి బ్రిటన్‌లో సేవలందిస్తున్న వైద్యులకు ఈ ఫోరం సేవలందిస్తున్నది.