హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై అప్పుల భారం రోజురోజుకు పెరిగిపోతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే అక్షరాలా రూ.1,46,918 కోట్ల అప్పు చేసింది. అంటే రోజుకు రూ.345 కోట్ల అప్పు తీసుకొచ్చి సర్కారు పాలన సాగిస్తున్నది. భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి మంగళవారం మరో రూ.3,000 కోట్ల రుణాన్ని సమీకరించింది. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ 31 వరకు ఒక్క ఆర్బీఐ నుంచే రూ.56,027 కోట్లు సమీకరించారు. జనవరిలో రెండు దఫాలుగా రూ.5,800 కోట్లు, ఈ నెల 4న మరో రూ.3,000 కోట్లు రుణం పొందింది. మొత్తం కలిపితే రూ.64,827 కోట్లు. ఆర్బీఐ ప్రతి మంగళవారం నిర్వహించే ఈ-వేలం ద్వారా సమీకరించిన మొత్తం రుణం అక్షరాలా రూ.64,827 కోట్లు. ఒక కొత్త ప్రాజెక్టు కట్టకుండా, ఒక ప్రతిష్టాత్మక పథకం పూర్తిగా అమలు చేయకుండా.. ఈ స్థాయిలో అప్పులు చేయడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఎఫ్ఆర్బీఎం పరిమితిని దాటి రుణాలు
కేంద్రప్రభుత్వం విధించిన ఎఫ్ఆర్బీఎం పరిధిని దాటి రాష్ట్ర సర్కారు రుణ సమీకరణ చేస్తున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితిని రూ.49,255 కోట్లకు విధించగా.. ఇప్పటికే రేవంత్రెడ్డి సర్కారు మూడు త్రైమాసికాల్లో (ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) తీసుకున్న రుణం రూ.41,759 కోట్లకు చేరింది. కేంద్రం అనుమతించిన ఎఫ్ఆర్బీఎం పరిమితిలో మిగిలిన రూ.7,500 కోట్ల రుణాలు ప్రస్తుత చివరి త్రైమాసికంలో (జనవరి, ఫిబ్రవరి, మార్చిలో) తీసుకొనే అవకాశం ఉంటుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం చివరి త్రైమాసికంలో ఏకంగా రూ.30 వేల కోట్ల అప్పు (నెలకు రూ.10 వేల కోట్ల చొప్పున) తీసుకుంటామని ఆర్బీఐకి ఇండెంట్లు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అడిగినంత అదనపు రుణం ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. ఆర్బీఐ జనవరిలో రూ.5,800 కోట్లు, 4న మరో రూ.3,000 కోట్లు ఇచ్చింది. ఈ నెలలో మిగిలిన మూడు వారాలతోపాటు వచ్చే నెలలో ఎంత మేరకు రుణం ఇస్తుందో చూడాల్సి ఉన్నది.
రేవంత్రెడ్డి సర్కారు సమీకరించిన అప్పులు ఇలా..
13 నెలల్లో ఒక్క ఆర్బీఐ నుంచి బహిరంగ వేలంలో పాల్గొని రేవంత్రెడ్డి సర్కారు ఇప్పటివరకు రూ.64,827 కోట్ల రుణం సమీకరించింది. కార్పొరేషన్లు/ఎస్పీవీల నుంచి ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా రూ.61,991 కోట్లు అప్పు తీసుకున్నది. ఎలాంటి గ్యారెంటీ ఇవ్వకుండా సర్కారు మరో రూ.10,099 కోట్ల రుణాలు సేకరించింది. టీజీఐఐసీ ద్వారా ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.10 వేల కోట్ల పొందింది. ఇలా మొత్తం రూ.1,46,917 కోట్లు సేకరించింది.