హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తున్నదా? తెలంగాణ రాష్ట్ర ఖజానా కుదేలైందా? 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో వేసిన అంచనాలను అందుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందా? తాజా గణాంకాలను పరిశీలిస్తే అవును అనే సమాధానమే వస్తుంది. జనవరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు సమర్పించిన నివేదిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కండ్లకు కడుతున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 40 రోజుల సమయం కూడా లేని తరుణంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని నివేదిక స్పష్టం చేస్తున్నది. కొవిడ్ కాలం నాటి దారుణ గణాంకాలు నమోదవుతుండటం కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని నిపుణులు మండిపడుతున్నారు. మందగించిన ఆదాయ వృద్ధి, పెరిగిన ఆర్థిక లోటు, అప్పులపై మితిమీరి ఆధారపడటం తప్ప రెండేండ్లకు పైబడిన కాంగ్రెస్ పాలనలో సాధించిందేమిటని ప్రశ్నిస్తున్నారు.
2025-26 బడ్జెట్ గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2.29 లక్షల కోట్ల మేర రెవెన్యూ రాబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ.. కాగ్ లెక్కల ప్రకారం జనవరి నాటికి రూ.1.38 లక్షల కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఇది అంచనాలో కేవలం 60.23%. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా రెండు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆర్థిక సంవత్సరంలో 85 శాతం కాలం గడిచిపోయింది. అయినా ప్రభుత్వం సాధించిన ఆదాయం కేవలం 60 శాతమే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేనాటికి 2023-24లో నమోదైన 63.2 శాతం కన్నా గణనీయంగా తగ్గడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన ప్రభావం కరోనా స్థాయిలో రాష్ట్ర ఖజానాపై పడిందని చెప్పడానికి కాగ్ నివేదికలే నిదర్శనం. గత ఐదేండ్ల రెవెన్యూ రాబడులను పరిశీలిస్తే.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే జనవరి నాటికి అత్యల్పంగా 55.80 శాతం ఖజానాకు చేరింది. ఆ ఏడాది కొవిడ్ ప్రభావంతో రాబడి తగ్గింది. ఆ తర్వాత కాంగ్రెస్ పాలనలోనే మళ్లీ రాబడులు పడిపోయాయి. 2024-25లో 55.96 శాతమే రాబడులు రాగా, ఈ ఏడాది 60.23 శాతం మాత్రమే వచ్చింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర పన్ను రాబడి లక్ష్యం రూ.1.75 లక్షల కోట్లుగా ప్రభుత్వం పేర్కొన్నది. కానీ జనవరి నాటికి రూ.1.26 లక్షల కోట్లు మాత్రమే వచ్చినట్టు కాగ్ నివేదిక స్పష్టం చేస్తున్నది. ఇది అంచనాల్లో 72శాతం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సొంత పన్నుల రాబడి ఏటికేడు రాకెట్ వేగంతో వృద్ధి సాధించింది. 2021-22లో బడ్జెట్ అంచనాల్లో జనవరి నాటికి ట్యాక్స్ రెవెన్యూ 79.87 శాతం, అలాగే 2022-23లో 80.72 శాతం, 2023-24లో 72.42 శాతం వసూలైంది. కానీ కానీ కాంగ్రెస్ పాలనలో పన్నుల రాబడి తగ్గిపోతున్నది. గడిచిన రెండేండ్ల గణాంకాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 2024-25లో 68.60 శాతం, 2025-26లో 72.04 శాతం మాత్రమే నమోదైందని కాగ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
కేసీఆర్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ రెండేండ్లపాలనలో ఆదాయ వనరుల పరిస్థితి రోజురోజుకూ తీసికట్టుగా మారింది. జనవరి నాటికి పన్నేతర ఆదాయం 24.87 శాతమే వచ్చింది. కేంద్రం నుంచి అందే గ్రాంట్లు కూడా కేవలం 18.49 శాతం వద్దే నిలిచిపోయాయి. జీఎస్టీ ఆదాయం 73.15 శాతం వసూళ్లతో కొంత ఊరటనిచ్చింది. ఎక్సైజ్ సుంకం 69 శాతం, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం 64.68 శాతంతో లక్ష్యానికి ఆమడ దూరంలోనే ఉన్నాయి. ఇవన్నీ 2024-25 కంటే కొంచెం మెరుగ్గా కనిపిస్తున్నా.. కేసీఆర్ పాలనతో పోల్చితే వెనుకబడి ఉన్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రెవెన్యూ మిగులు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశించినప్పటికీ, అందుకు విరుద్ధంగా లోటు పెరిగిపోతున్నది. ప్రభుత్వం ఈ ఏడాది రూ.2,738 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని ఆశించగా, జనవరి నాటికి పరిస్థితి తారుమారై రూ. 10,566 కోట్ల లోటు నమోదైంది. మరోవైపు, రెవెన్యూ వ్యయం (జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, సబ్సిడీలు) ఇప్పటికే రూ.1.48 లక్షల కోట్లకు (65.62 శాతం) చేరింది.
ఆదాయం రాబట్టలేక కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులపై నియంత్రణ పాటిస్తామని కాంగ్రెస్ నేత బీరాలు పలికారు. కానీ కాగ్ గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో అప్పులపై ఆధారపడిందో తెలుస్తుంది. నివేదిక ప్రకారం.. రాష్ట్రం ఇప్పటికే తన వార్షిక అప్పుల పరిమితిని మించిపోయింది. బడ్జెట్లో రూ.54,009 కోట్ల మేర అప్పులు చేస్తామని ప్రభుత్వం పేర్కొన్నది. కానీ జనవరి నాటికే రూ.69,148 కోట్ల మేర రుణాలు తీసుకున్నది. అంటే అంచనాకు మించి 128 శాతం చేరుకున్నది. దీంతో రాష్ట్ర ద్రవ్యలోటు రూ.69,148 కోట్లకు, ప్రాథమిక లోటు రూ.45,063 కోట్లకు పెరిగింది. పెరుగుతున్న వడ్డీ చెల్లింపులు, మందగించిన ఆదాయం, అదుపు తప్పుతున్న వ్యయాలను అరికట్టేందుకు తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే, తెలంగాణ దీర్ఘకాలిక రుణ సంక్షోభంలో చికుకునే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

