నాంపల్లి కోర్టులు, జూలై 25 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుతోపాటు ఓ మీడియా సంస్థ ప్రతినిధి శ్రావణ్ కుమార్‌ను అరెస్టు చేసి, న్యాయస్థానంలో హాజరుపర్చాలని కోర్టు ఇచ్చిన గడువు గురువారంతో ముగిసింది.
విదేశాల్లో ఉన్న వీరిద్దరితోపాటు ఈ కేసులోని ఇతర నిందితులందరినీ ఈ నెల 26న నాంపల్లి కోర్టులో తప్పనిసరిగా హాజరుపర్చాలని 12వ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య గతంలో ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. కానీ, ప్రభాకర్‌రావు, శ్రావణ్ కుమార్ ఇప్పటికీ విదేశాల్లోనే ఉండటంతో పోలీస్ అధికారులకు ఏమీ పాలుపోవడం లేదు.
దీంతో ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న అదనపు ఎస్పీలు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ అధికారి రాధాకిషన్‌రావును మాత్రమే శుక్రవారం కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ క్రమంలో ప్రభాకర్‌రావు, శ్రావణ్ కుమార్ అరెస్టు విషయమై పోలీసులు కోర్టుకు ఏమి సమాధానమిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కాగా, ఏసీపీ వెంకటగిరికి ఇటీవల ప్రభాకర్‌రావు రాసిన లేఖను కోర్టుకు నివేదించేందుకు ఆయన తరఫు న్యాయవాది సిద్ధమవుతున్నారు.
పోలీసుల పిటిషన్‌పై నేడు విచారణ
రాధాకిషన్‌రావును మరో వారం రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ జూబ్లీహిల్స్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని నిందితుల తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. ఆయన బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించింది. ఈ రెండు పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది.