మధిర టౌన్, జూలై 21: చనిపోయిందు కున్న తల్లి కండ్లముందు ప్రత్యక్షం కావడంతో ఆ కొడుకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వివరాల ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పుల్లూరు మండలం కొత్తగూడేనికి చెందిన నాగేంద్రమ్మ అనే వృద్ధురాలికి మతిస్థిమితం సరిగ్గా లేదు. రెండేండ్ల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. దీంతో భర్త తిరుపతయ్యతోపాటు ఇద్దరు కుమారులు అనేకచోట్ల గాలించినా, ఆచూకీ లభించలేదు. కొద్దిరోజుల తర్వాత కొత్తగూడెం ప్రాంతంలో ఓ మహిళను దుండగులు పెట్రోల్ పోసి కాల్చి చంపారని తెలుసుకొన్నారు.
మృతురాలు నాగేంద్రమ్మగా భావించి భర్త, కుమారులు కర్మకాండలు కూడా పూర్తిచేశారు. ఇలావుండగా ఇటీవల కుటుంబసభ్యులు ఓ యూ ట్యూబ్ చానల్ ద్వారా నాగేంద్రమ్మ ఆచూకీని తెలుసుకొన్నారు. ఆమె మధిరలోని ఓ ఆశ్రమంలో ఉన్నట్టు తెలుసుకొని మధిర పోలీసులను ఆశ్రయించగా, శుక్రవారం నాగేంద్రమ్మను కుటుంబ సభ్యులకు అప్పగించారు. చనిపోయిందనుకున్న తల్లి కనిపించడంతో ఇద్దరు కుమారులు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు.