హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఓపెన్ యాక్సెస్‌లో విద్యుత్తును కొనుగోలు చేసేవారి నుంచి యూనిట్‌కు రూ.1.69 వసూలు చేయాలని డిసంలు నిర్ణయించాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తొలి అర్ధవార్షికానికి(2025 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వరకు)గాను రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి(టీజీఈఆర్సీ)లో దక్షిణ డిసం(ఎస్పీడీసీఎల్), ఉత్తర డిసం(ఎన్పీడీసీఎల్) గురువారం పిటిషన్లు దాఖలు చేశాయి.
తొలి అర్ధవార్షికంలో 18180 మిలియన్ యూనిట్లను ఓపెన్ యాక్సెస్ వినియోగదారులు బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నాయి. ఈ పిటిషన్లపై 2025 జనవరి 20న ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి(టీజీ ఈఆర్సీ) బహిరంగ విచారణ చేపట్టనున్నది.