న్యూఢిల్లీ, జూలై 9: డిజిటల్ వ్యక్తిగత డాటా పరిరక్షణ (డీపీడీపీ) చట్టం దశల వారీగా అమలు అవుతున్న సమయంలో కొందరు సైబర్ నేరగాళ్లు లక్షలాది మంది విద్యార్థుల డాటా ఆన్లైన్లో విచ్చలవిడిగా అమ్మకానికి పెట్టడం సంచలనం సృష్టించింది. ఇటీవల జరిగిన సీయూఈటీ, నీట్ పరీక్షలకు హాజరైన లక్షలాది మంది విద్యార్థుల వ్యక్తిగత డాటాను కొన్ని వెబ్సైట్లు అమ్మకానికి ఉంచాయి.
విద్యార్థి పేరు, తండ్రి పేరు, ఊరు, ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్, విద్యార్హత, ఈ-మెయిల్, చిరునామా వివరాలన్నీ వారి వద్ద ఉన్నాయి. స్టూడెంట్ డాటా ప్రొవైడర్.కామ్, స్టూడెంట్ డాటా బేస్.కామ్, స్టూడెంట్ డాటా హబ్.కమ్ సహా అక్రమాలకు పాల్పడుతున్న పలు సైట్లు వీరి డాటాను అమ్మకానికి ఉంచాయి. వెయ్యి నుంచి రూ. 10 వేల లోపు ఈ డాటాను అవసరమైన వారికి విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. ఈ విద్యార్థుల డాటాను ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆర్థిక సంస్థలు కొనుగోలు చేస్తుంటాయి.