RRR | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ప్రాంతీయ రింగురోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం నిర్మాణం మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటం, భూసేకరణ ప్రక్రియ ఇంకా పూర్తకాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. అందువల్లే ఏజెన్సీలను ఖరారు చేయడంలో జాప్యం జరుగుతోంది. ముఖ్యమంత్రితోపాటు రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఇప్పటికే పలుమార్లు జాతీయ రహదారుల శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినా ఎలాంటి పురోగతి లేకపోవడమే ఇందుకు నిదర్శనం. ట్రిపుల్ఆర్ను రెండు దశల్లో అభివృద్ధి చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో తొలుత ఉత్తర భాగాన్ని నిర్మించేందుకు టెండర్ల ప్రక్రియ చేపట్టినప్పటికీ దాఖలైన బిడ్లను మాత్రం తెరవడంలేదు.
జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖతోపాటు పీపీపీ అప్రైజల్ కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. దీంతో బిడ్లు తెరిచే గడువును ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా వేశారు. భూసేకరణపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడం, పలుచోట్ల కోర్టు స్టే ఉత్తర్వు లు ఉండటంతో టెండర్ల విషయంలో తొందరపడరాదని కేంద్రం నిర్ణయించినట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి.
బిడ్లు తెరిస్తే ఎంపికైన ఏజెన్సీకి పనులు కేటాయించాల్సి వస్తుందని, ఆ తర్వాత ఏ కారణంచేతనైనా అవి ముందుకు సాగకపోతే ఏజెన్సీలు పనులను నిలిపివేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతోపాటు భారీగా నష్ట పరిహారాన్ని డిమాండ్ చేస్తాయని, అందుకే అసలు బిడ్లే తెరవకుండా ఉంటే ఏ తలనొప్పీ ఉండదని, భూసేకరణ పూర్తయ్యాకే పనులు చేపడదామని ఎన్హెచ్ఏఐ అధికారులు భావిస్తున్నారు. దీనికి హైదరాబాద్-విజయవాడ రహదారిని ఉదాహరణగా చూపుతున్నారు.
ఈ రహదారిని 8లేన్లుగా విస్తరించాలని ఒప్పందంలో ఉన్నప్పటికీ పనులు చేపట్టిన ఏజెన్సీ రాష్ట్ర విభజన వల్ల తనకు టోల్ వసూలు కావడంలేదనే కారణంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పనులు నిర్వహించకపోవడంతో దాదాపు పదేళ్లపాటు ఈ రహదారి విస్తరణకు నోచుకోలేదు. తొందరపడి ట్రిపుల్ ఆర్ విషయంలో కూడా ఏజెన్సీని ఎంపికచేస్తే ఇలాగే జరుగుతుందని ఎన్హెచ్ఏఐ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.
ట్రిపుల్ఆర్ నిర్మాణం కోసం భూములిచ్చే రైతులకు నష్టపరిహారాన్ని చాలా తక్కువగా నిర్ణయించడంతో భూసేకరణ ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మార్కెట్ విలువ ప్రకారం ఎకరం రూ.2 లక్షలు, బహిరంగ మార్కెట్ ధర ప్రకారం రూ.50 లక్షలకుపైగా పలుకుతున్నది. కానీ, రూ.6 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో భూములిచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. మొత్తం 4,682 ఎకరాల్లో 3,261 ఎకరాలకు అవార్డ్ పాస్ చేసినప్పటికీ ఇంకా నష్టపరిహారాన్ని చెల్లించలేదు. అందులో దాదాపు 200 ఎకరాల అటవీభూమి ఉండటంతో ఆ భూమికి బదులుగా అటవీశాఖకు మరోచోట భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. మిగిలిన భూముల విషయంలో రైతుల వ్యతిరేకత, కోర్టు కేసులు అడ్డంకిగా ఉన్నాయి. 232 ఎకరాలపై కోర్టు కేసులు ఉండగా.. 1,107 ఎకరాలు ఆర్బిట్రేషన్ వద్ద విచారణలో ఉన్నాయి.
ట్రిపుల్ఆర్ను నిర్మించే జిల్లాల్లో ఇప్పటికే భూముల ధరలను పెంచిన ప్రభుత్వం.. భూసేకరణ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ల నేతృత్వంలో ఆర్బిట్రేషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ భూములు పట్టణానికి దగ్గరగా ఉన్నాయా, వాటిలో ఏటా ఎన్ని పంటలు పండుతాయి, ప్రస్తుతం ఆ భూముల ధరలు ఎలా ఉన్నా యి. భవిష్యత్తులో వాటి విలువ ఏ మేరకు పెరగవచ్చన్న అంశాల ఆధారంగా ఆర్బిట్రేషన్ ఖరారు చేసిన ధరలను ఎన్హెచ్ఏఐ చెల్లించాల్సి ఉం టుంది.
భూసేకరణ చట్టం ప్రకారం భూములు కోల్పోతున్నవారికి గ్రామీణ ప్రాంతాల్లో అయితే మార్కెట్ ధరకు కనీసం రెండు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే నాలుగు రెట్లు అధికంగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తే భూసేకరణ సాధ్యంకాదని నిర్ణయానికొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. రైతులకు సాధ్యమైనంత ఎక్కువ నష్టపరిహారం చెల్లించాలని కేంద్రాన్ని కోరింది. గ తంలో ఎన్టీపీసీ చెల్లించిన విధంగా ఎకరాకు కనీసం రూ.30 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కానీ, ఒకచోట అధికంగా చెల్లిస్తే ప్రతిచోటా ఇదే విధమైన డిమాండ్లు వస్తాయని, రోడ్ల నిర్మాణం ముందుకుసాగే వీలుండదని ఎన్హెచ్ఏఐ భావిస్తున్నట్టు తెలిసింది.