Congress | హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): మంత్రివర్గ కూర్పుపై ముఖ్యనేత ఎత్తులు బెడిసికొట్టినట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం జరుగుతున్నది. అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వ మనుగడే ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉన్నదనే సంకేతాలు అందటంతో కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తమైనట్టు తెలిసింది. ముఖ్యనేత సూచనలు, నివేదికల మేరకు ఇద్దరు మంత్రులను తొలగించి, కొంతమంది మంత్రుల శాఖల్లో మార్పులతో మంత్రివర్గాన్ని పునర్వ్యవ్యస్థీకరించాలని భా వించిన ఆధిష్ఠానం, దక్షిణ తెలంగాణకు చెంది న ఓ నేత ఇచ్చిన ధమ్కీతో వెనక్కు తగ్గినట్టు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. పాత మంత్రివర్గా న్ని కదపకుండా ఖాళీగా ఉన్న ఆరు స్థానాల్లో ఇప్పుడు నాలుగు మాత్రమే నింపి, మరో రెండు స్థానాలు ఖాళీగా పెట్టడం ద్వారా ఆశావాహులను ఊరిస్తూ ప్రమాదం నుంచి గట్టెక్కాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
మంత్రివర్గ విస్తరణకు అధిష్ఠానం నుంచి వచ్చిన గ్రీన్ సిగ్నల్ కాంగ్రెస్‌లో పెను దుమారాన్నే రేపుతున్నది. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు 30 మంది పోటీపడుతున్నారు. అధిష్ఠానం దూత మీనాక్షి నటరాజన్ తెలంగాణకు వచ్చి 20 రోజులపాటు ఇక్కడే మకాం వేసి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆమె నుంచి అందిన సూచనల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానంతో కూర్పుపై చర్చించి వచ్చారు.
నలుగురిలో సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు కలిసి ఒక జాబితా, భట్టి, ఉత్తమ్ చెరో జాబితా అధిష్ఠానానికి ఇచ్చినట్టు తెలిసింది. సీఎం ఇచ్చిన జాబితాలో సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గడ్డం వివేక్ పేర్లు ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తమ్ జాబితాలో ఆయ న భార్య పద్మావతి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, దొంతి మాధవరెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వినోద్ పేర్లు ఉన్నట్టు సమాచారం. ఇక భట్టి విక్రమార్క జాబితాలో వాకిటి శ్రీహరి, ప్రేమ్‌సాగర్‌రావు, మల్రెడ్డి రంగారెడ్డి, బాలునాయక్, దొంతి మాధవరెడ్డి పేర్లు ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. వాకిటి శ్రీహరి పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా సూచించినట్టు ఢిల్లీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
సీతకకు హోంమంత్రిగా పదోన్నతి కల్పించి, ఎస్టీలకు ఒకే ఒక బెర్త్‌తో సరిపెడతారన్న ప్రచారం జరుగుతున్నది. దీనిపై బంజారా గిరిజన శక్తి, బంజారా విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన లంబాడ గిరిజన సంఘాలు శుక్రవారం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇప్పుడున్న కూర్పులో అటు బంజారాలకు కానీ, ఇటు ఎస్సీ మాదిగలకు గానీ బెర్తు దొరికే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
తన డబ్బుతో ఆధికారంలోకి వచ్చి తనకే ఉనికి లేకుండా ముఖ్యనేత పావులు కదుపుతున్నారని ఆగ్రహించిన దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రి ఎట్లా పునర్వ్యవస్థీకరణ చేస్తారో చూస్తానంటూ పార్టీకి అల్టిమేటం పంపినట్టు సమాచారం. తన భార్యకు మంత్రి పదవి ఇవ్వకుంటే ఊరుకునేది లేదని ఉత్తమ్ గట్టి పట్టుదలతో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ఉత్తమ్‌ను ఒప్పించిన తరువాతే మంత్రివర్గ కసరత్తుపై ముందుకు వెళ్లాలని సోనియాగాంధీ ఏఐసీసీ నేతలకు నిర్దేశించినట్టు ఢిల్లీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇంకోవైపు సుదర్శన్‌రెడ్డి పేరు తెరమీదకు రావటంతో నర్సంపేట ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నేత దొంతి మాధవరెడ్డి ఢిల్లీ వెళ్లారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిశారు. మరింత కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిసేందకు ఢిల్లీ బాట పడుతున్నారు.
మంత్రివర్గంలో రంగారెడ్డి, హైదరాబా ద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన నేతలకు చోటు లభించలేదు. ఈ మూడు జిల్లాలకు కనీసం ఒక్కొక్కరి చొప్పునైనా అవకాశం కల్పించాల్సి ఉంది. నిజామాబాద్ జిల్లా నుంచి సీఎం రేవంత్‌తో సఖ్యతగా ఉండే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పేరు ను సూచించినట్టు తెలిసింది. ఇదే జిల్లా నుంచి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కూడా ఎస్సీ మాదిగ సామాజికవర్గం కోటా కింద మంత్రి పదవిని ఆశిస్తున్నట్టు సమాచారం. రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రాంమ్మోహన్‌రెడ్డి, కాలె యాదయ్య పోటీపడుతున్నారు. ఆదిలాబా ద్ జిల్లా నుంచి గడ్డం వివేక్ పేరు బయటికి రావటంతో ఆగ్రహిస్తున్న మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేలు ఆరుగురు అధిష్ఠానానికి లేఖలు రాసినట్టు సమాచారం.