హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కేసీఆర్ కిట్‌తో వచ్చిన సామాజిక మార్పులను పరిగణలోకి తీసుకోకుండా రేవంత్‌రెడ్డి సర్కారు ఆ పథకానికి మంగళం పాడిందని విమర్శలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ మీద ఉన్న అక్కసుతోనే పథకం పేరును ‘ఎంసీహెచ్ కిట్’గా మార్చారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కిట్ల పంపిణీని పూర్తిగా విస్మరించిందని చెప్తున్నారు. పేద మహిళలకు ప్రసవం సమయంలో ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా కేంద్రం ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) ప్రారంభించింది. తల్లులకు పౌష్టికాహరం అందించే లక్ష్యంతో పథకం ద్వారా వచ్చిన రూ.65 కోట్లు ‘ఎస్క్రో’ ఖాతాలో ఉన్నా కాంగ్రెస్ సర్కారు వినియోగించుకోవడం లేదు. దీంతో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ఇటీవల జరిపిన సమీక్షలో.. ఈ నిధులను వెనక్కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది.
బీఆర్ఎస్ హయాంలో మానవీయ కోణంలో పాలన అందించిన కేసీఆర్.. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2017లో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఏటా రెండు లక్షల వరకు కిట్లను పంపిణీ చేశారు. సర్కారు దవాఖానలో మగబిడ్డ పుడితే రూ.12ఏవేలు, ఆడబిడ్డ పుడితే రూ.13వేల చొప్పున అందించారు. కేసీఆర్ కిట్‌తోపాటు, న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేశారు. ఈ పథకాల ద్వారా మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గాయి.
ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. కేసీఆర్ కిట్ పథకాన్ని.. ఎంసీహెచ్ కిట్ పేరుగా మార్చిన కాంగ్రెస్ సర్కారు.. పథకాన్ని మాత్రం అమలు చేయడంలేదు. కేంద్రం మంజూరు చేసిన నిధులను కూడా వాడుకోవడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి, ఎంసీహెచ్ కిట్లను పంపిణీ చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.