హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోక్సో కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కొడుకు ఎక్కడ?’ అనే ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి. బాధితురాలు మైనర్‌గా తేలడంతో బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్(భగ్గీ) కనిపించడం లేదు. ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ హైడ్ అయిపోగా, ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉన్నది. పోక్సో కేసు నమోదు కావడంతో అతను పారిపోయినట్టు సాక్షాత్తూ పోలీసులే చెబుతున్నారు. అయితే, గతంలో ఏ నేరం జరిగినా నిమిషాలు, గంటల వ్యవధిలో నిందితులను అదుపులోకి తీసుకొని విచారించే పోలీసులే.. ఇప్పుడు కావాలనే నిందితుడిని పట్టుకోవడం లేదని స్పష్టమవుతున్నది.
ఆదివారం ఉదయం నుంచే భగీరథ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటం మరిన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే తండ్రి సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కావడం.. తెలంగాణలో కాంగ్రెస్-బీజేపీ బంధం బలంగా ఉండటం, కావాలనే అతన్ని తప్పించే ప్రయత్నం జరుగుతున్నట్టు జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి.
బీఆర్ఎస్ను విమర్శించే సందర్భం ఏదైనా సరే చెట్టాపట్టాలేసుకొని.. ఒక పద్ధతి ప్రకారం కలిసి వెళ్లే బండి సంజయ్, ముఖ్యనేతలు తమదాకా వచ్చేసరికి జాగ్రత్తలు పడుతున్నట్టు తెలుస్తోంది. కుమారుడిపై ఏకంగా పోక్సో కేసు నమోదైనా పోలీసులు అరెస్టు చేయకపోవడానికి ప్రధాన కారణం.. ముఖ్యనేత నుంచి వచ్చిన ఆదేశాలేనని పోలీసువర్గాలు అంటున్నాయి. ‘ఈ కేసులో ఇప్పుడే అరెస్టులేమీ వద్దు.. కొన్నాైళ్లెతే అంతా సద్దుమణుగుతుంది.. దీనిపై మనవాళ్లు ఎవరూ మాట్లాడొద్దు’ అంటూ ముఖ్యనేత తన అనుచరగణానికి ఆదేశాలు రావడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసే సాహసం చేయడం లేదని సమాచారం.
ఇక ముఖ్యనేత ఆదేశాల మేరకు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు.. ముఖ్యంగా మహిళా మంత్రులు సైతం నోరు మెదపడం లేదు. అటు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా మూగబోయింది. ఇంకొందరు కాంగ్రెస్ సోషల్ వారియర్స్ బండి సంజయ్‌కు మద్దతుగా పోస్టులు, కామెంట్లు పెడుతూ ముఖ్యనేత అడుగుజాడల్లో నడుస్తున్నారు. సంజయ్ కొడుకు వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు, పెద్దలు సంపూర్ణ మద్దతిస్తున్నారు. ఇటీవల కొత్తగా పార్టీ పెట్టిన వారు కూడా ఈ అంశంపై మాట్లాడకపోవడంతో సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తున్నది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. బీజేపీ నేతలకు ఆ పార్టీ మద్దతు దండిగా ఉండటంతో పక్కా పథకం ప్రకారం తన కొడుకును తండ్రి బండి సంజయ్ తప్పించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఒక్క ఫోన్ నంబర్ ఆధారంగా విదేశాల్లోనూ రహస్య ఆపరేషన్లు చేసి అరెస్టు చేసిన పోలీసులు సైతం.. ‘భగీరథ్ ఎక్కడున్నాడో మాకు తెల్వడం లేదు. ఆయన ఫోన్ స్విచ్ఛాప్ వస్తుంది’ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నది.
కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ సైతం.. మహిళల రక్షణే తమ ప్రథమ కర్తవ్యమని చెప్పి.. బండి కుమారుడి విషయంలో కిక్కురమనడం లేదని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి. తన కుమారుడి ఆచూకీ దొరకకపోతే.. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంటే.. తండ్రి సంజయ్ మాత్రం ఎలాంటి కంగారు లేకుండా ప్రధాని సభలో జోష్‌తో మాట్లాడారు. కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు ఇవ్వకపోవడంతో.. అతనే తన కొడుకును తప్పించి ఉంటాడని అనుమానాలు తలెత్తుతున్నాయి.