గోపాల్పేట, ఆగస్టు 27: మత్స్యకారులకు ఉచిత చేపపిల్లల పంపిణీపై కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేసింది. కేసీఆర్ సర్కార్ మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు అందించగా.. ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వనపర్తి జిల్లా గోపాల్పేటకు చెందిన 97 మంది మత్స్యకారులు రూ.2,500 చొప్పున రూ.3 లక్షలు జమచేసి 4.60 లక్షల చేపపిల్లలను కొనుగోలు చేశారు.
వాటిని మంగళవారం గోపాల్పేట శివారులోని పెద్ద చెరువు, కత్వ చెరువు, అమ్మ చెరువు, నీలయ్యకుంట, ఎర్రకుంట, రెడ్ల కుంటల్లో వదిలినట్టు మత్స్యకారుల సంఘం మండలాధ్యక్షుడు బాలరాజు తెలిపారు. బొచ్చలు, రవటలు, బంగారుతీగలు, కొర్రమీను, గడ్డి చేపల వంటి రకాల చేపపిల్లలను కొనుగోలు చేసినట్టు చెప్పారు. మత్స్యకారుల సంఘ సభ్యులు వెంకటయ్య, చంద్రయ్య, రాయుడు, బాలరాజు, మైబూస్, నర్సింహ, వెంకటయ్య, గోపి, శివుడు, బాలయ్య పాల్గొన్నారు.