అలంపూర్ చౌరస్తా, డిసెంబర్ 25 : రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆరోపించారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం కలుకుంట్లలో మక్క కొనుగోలు కేంద్రం వద్ద బుధవారం రైతు జమ్మన్న గుండెపోటుతో మృతిచెందగా.. గురువారం ఆయన స్వగ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే రైతు భౌతికకాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నేతలతో కలిసి రైతు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొస్తే కొనకుండా అక్కడి సిబ్బంది రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
తేమ శాతం పేరుతో కొర్రీలు పెడుతున్నారని, దీంతో కేంద్రాల వల్లే చలిలో సైతం రాత్రీపగలు తేడాలేకుండా రైతులకు పడిగాపులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రైతు జమ్మన్న సైతం పండించిన మక్కలను అమ్ముకునేందుకు కేంద్రానికి వచ్చాడని, సరైన సమయంలో కొనుగోలు చేయకపోవడంతో తిండిలేక, నిద్రలేక అలసిపోయి గుండెపోటుతో మృతి చెందినట్టు తెలిపారు. రైతు మృతితో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.