హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణను అప్పుల కుప్పగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో రూ.1,000 కోట్ల రుణం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో బ్యాంకుల ద్వారా తీసుకున్న అప్పు రూ.2 వేల కోట్లకు, గత ఆరున్నర నెలల్లో తీసుకున్న మొత్తం అప్పు రూ.28 వేల కోట్లకు చేరింది. అంటే రోజుకు ఏకంగా రూ.143 కోట్ల చొప్పున రుణాలు సేకరించింది. కానీ, రాష్ట్రంలో ఆస్తులను సృష్టించడంపై రేవంత్ సర్కారు ఎలాంటి శ్రద్ధ కనబరచడం లేదని ఆర్థికరంగ నిపుణులు, రాజకీయవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ అప్పులతో ఒక భారీ ప్రాజెక్టు కానీ, ప్రజల జీవితాలను మార్చే ఒక భారీ పథకంగానీ చేపట్టిన దాఖలాలు లేవని చెప్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అప్పుల్లో ముంచిందని తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్.. ఇప్పుడు తాను చేస్తున్నదేమిటని ప్రశ్నిస్తున్నారు. తెచ్చిన అప్పులతో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వాలు తెచ్చిన అప్పులను పెట్టుబడిగా మార్చి.. భవిష్యత్తులో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆదాయ వనరుగా మారే ప్రాజెక్టుల్లోనో, ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థను ఏర్పాటు చేయడానికో వాడుతుంటాయని చెప్తున్నారు.
ఉదాహరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసింది. ఇవి ప్రత్యక్షంగా ప్రజలకు, పరోక్షంగా ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారాయి. రుణం సేకరించి మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి చేసింది. ఇది ఆదాయ వనరు కాకపోయినా, ప్రజల జీవన స్థితిగతులను మార్చింది. ఇలాంటి పథకాలు గత ఆరున్నర నెలల్లో ఒక్కటి కూడా ప్రకటించలేదని గుర్తు చేస్తున్నారు. ‘ఒక్క ప్రాజెక్టు కట్టిందీ లేదు.. కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందీ లేదు’ అంటూ విమర్శిస్తున్నారు.
‘నాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించి, ఇప్పుడు మీరు కూడా అప్పులు చేస్తున్నారు కదా?’ అని రేవంత్ సర్కారుకు వివిధ వర్గాల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీంతో ప్రభుత్వం కొత్త పాట మొదలు పెట్టిందని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. తెచ్చిన అప్పుల కన్నా, తీర్చిన బాకీలే ఎక్కువ ఉన్నాయంటూ ప్రచారం చేసుకుంటున్నదని మండిపడుతున్నారు. రూ.25 వేల కోట్ల అప్పులు తెచ్చామని, ఇదే సమయంలో రూ.38 వేల కోట్ల మేర వడ్డీలు, కిస్తీలు చెల్లించామంటూ తమ అనుకూల మీడియాలో కథనాలు రాయించుకొని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నదని విమర్శిస్తున్నారు. ప్రభుత్వాలకు వాసత్వంగా రుణాలు రావడం సహజమేనని చెప్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుడు డిసెంబర్లో విడుదల చేసిన శ్వేతపత్రంలో తెలంగాణ ఏర్పడేనాటికి రూ.72,658 కోట్ల అప్పులు ఉన్నట్టు పేర్కొన్నారని గుర్తు చేస్తున్నారు. అప్పటికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేవని వివరించారు. దీంతో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు రుణాలను సేకరించి ఆ నిధులను మూలధన వ్యయంగా ఖర్చు చేసిందని చెప్తున్నారు. అటు మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఇటు భారీ ప్రాజెక్టులు, పథకాలను అమలు చేసిందని వివరిస్తున్నారు.
ఫలితంగా రాష్ట్ర ఆదాయం, తలసరి ఆదాయం, జీఎస్డీపీ వంటివి రెండున్నర రెట్ల మేర పెరిగాయని ఉదహరిస్తున్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టానికి వస్తున్న ఆదాయం పోనూ.. తీసుకొచ్చే అప్పులను మూలధన వ్యయంగా ఖర్చు చేయాల్సింది పోయి.. ఏ రంగానికి ఖర్చు చేస్తున్నామో కూడా ప్రజలకు చెప్పడం లేదని విమర్శిస్తున్నారు. దానిని కప్పిపుచ్చుకునేందుకు ‘రీపేమెంట్స్’ పేరుతో నాటకాలు ఆడుతున్నదని మండిపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తీసుకుంటున్న రుణాలకు అదనంగా కార్పొరేషన్ల ద్వారా అప్పులు తేవాలని నిర్ణయించింది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ) ద్వారా రూ.5 వేల కోట్ల రుణాలు తీసుకోనున్నది. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేసింది. ఆదివారం నుంచి బిడ్డింగ్ మొదలైంది. జూలై 1వ తేదీలోగా బిడ్లు దాఖలు చేయాలని సూచించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, రుణాలు సేకరిస్తున్నదంటూ ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ గగ్గోలు పెట్టిన విషయాన్ని రాజకీయవేత్తలు గుర్తుచేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు టీజీఐఐసీ ద్వారా ఏకంగా రూ.5 వేల కోట్లు సేకరించడంపై మండిపడుతున్నారు. సేకరించే నిధులను మౌలిక వసతుల కల్పనకు వినియోగిస్తారా? లేదా నిధులను మళ్లించి ఇతర పథకాలకు పంపుతారా? అని అనుమానం వ్యక్తంచేస్తునారు. టీజీఐఐసీ కార్పొరేషన్ రుణాల సేకరణ ప్రక్రియ సవ్యంగా సాగితే.. మిగతా అన్ని కార్పొరేషన్ల ద్వారా రుణాలు సేకరించాలన్నదే ప్రభుత్వం ప్రణాళికగా చెప్పుకుంటున్నారు.