హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తేతెలంగాణ): తమ బిల్లుల బకాయిలు చెల్లించాలని నిరసనకు దిగుతున్న తాజామాజీ సర్పంచులపై రేవంత్రెడ్డి సర్కారు జులుం ప్రదర్శిస్తున్నది. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అడితే అణచివేత చర్యలకు దిగుతున్నది. సర్పంచుల సంఘం రాష్ట్ర జేఏసీ ఈ నెల 4న ‘చలో హైదరాబాద్’ పేరిట చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడుగడునా అడ్డుకున్నది. రాష్ట్రంలోని వివిధ గ్రామాల నుంచి తరలివస్తున్న మాజీ సర్పంచులను ఎక్కడికక్కడే నిర్బంధించింది. తాజాగా ఆదివారం ఉదయం హైదరాబాద్లోని మహా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు యత్నించిన జేఏసీ రాష్ట్ర నాయకులను అడ్డుకున్నది. పోలీసులు వారిని చుట్టుముట్టి బలవంతంగా అరెస్ట్ చేసి బలవంతంగా ఈడ్చుకెళ్లి వ్యాన్లో ఎక్కించి నాంపల్లి పోలీస్స్టేషన్ తరలించారు.
అంతకుముందు అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. కానీ సీఎం రేవంత్రెడ్డి మాత్రం రూ.750 కోట్లు ఇచ్చామని అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయమై వాస్తవాలు వెల్లడించేందుకు ప్రెస్మీట్ పెట్టేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగితే అక్రమంగా అరెస్ట్ చేయడమే ప్రజాపాలనా? అని నిలదీశారు.