పెద్దపల్లి, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ)/ మంథని/మంథని రూరల్/మల్హర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని తనుగుల, అడవి సోమన్‌పల్లి చెక్‌డ్యామ్‌లను కచ్చితంగా పేల్చి వేశారని నిజనిర్ధారణ కమిటీ స్పష్టంచేసింది. చెక్‌డ్యామ్‌లు కొట్టుకుపోలేదని, కుట్రపూరితంగానే ధ్వంసం చేశారనే విషయం శిథిలాలాను పరిశీలిస్తే అర్థమవుతున్నదని తేల్చిచెప్పింది. ఈ మేరకు నిర్ధారణకు వచ్చామని కమిటీ సభ్యుడు, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్ తెలిపారు. ఈ విధ్వంసాలను చూస్తే తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసే కుట్రగానే అర్థమవుతున్నదని ఆరోపించారు. చెక్‌డ్యామ్‌లను, సాగునీటి ప్రాజెక్టులను ప్రజలు, రైతులే కాపాడుకోవాలని, రైతులే రక్షణ దళాలుగా ఏర్పాటు కావాలని సూచించారు. ప్రజలంతా మరో జల ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
పెద్దపల్లి జిల్లా అడవి సోమన్‌పల్లి ధ్వంసమైన చెక్‌డ్యామ్‌ను శనివారం కమిటీ సభ్యులు, సాగునీటిశాఖ విశ్రాంత సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి సీతారామారావు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రాఘవరెడ్డి, ఫిషరీస్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ పిట్టల రవీందర్, జర్నలిస్టులు శంకర్, బుచ్చన్న, తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు మల్లోజుల విజయానంద్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం అడవి సోమన్‌పల్లి, మంథనిలో విలేకరుల సమావేశంలో వీ ప్రకాశ్ మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు నీటి స్టోరేజీ లేదని, అక్కడున్న 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి నీళ్లుండవని, తెలంగాణలో చెక్‌డ్యామ్‌లను విధ్వంసం చేసిన తీరును చూస్తే మళ్లీ తెలంగాణ నుంచి నీళ్లను దోచుకెళ్లే కుట్రలు జరుగుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికతో పని చేశారని కొనియాడారు. మిడ్ మానేరు రిజర్వాయర్‌ను పూర్తి చేయడంతోపాటు మానేరు నదిపై 22 చెక్‌డ్యామ్‌లు కట్టారని గుర్తుచేశారు.
12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు తనుగుల, అడవిసోమన్‌పల్లి చెక్ డ్యామ్‌లు కొట్టుకు పోలేదని, వరద లేని సమయంలో కొట్టుకపోవడం జరగదని సాగునీటి శాఖ విశ్రాంత సూపరిండెంట్ ఇంజినీర్ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తెలిపారు. ఒకవేళ చెక్‌డ్యామ్ కొట్టుకుపోతే శిథిలాలు ఎగువ భాగాన ఉండవు అని స్పష్టంచేశారు. శిథిలాలన్నీ దిగువకే కొట్టుకుపోతాయని వివరించారు. ఇది ముమ్మాటికి పేల్చివేతనే అని తేల్చిచెప్పారు. అడవిసోమన్‌పల్లి చెక్‌డ్యామ్ నాణ్యత, నిర్మాణ లోపాలతో కూలిపోలేదని స్పష్టంచేశారు. మూడు, నాలుగు బెడ్స్ కన్పిస్తున్నాయని, బాడీవాల్ 120 మీటర్ల వరకు కొట్టుకు పోయిందని ఇరిగేషన్ అధికారులు ఎఫ్ఐఆర్లో రాశారని వివరించారు.
ఆధారాలను పట్టి చూస్తే ఇది కచ్చితంగా పేలుడు అని తేల్చిచెప్పారు. ఇంజినీరింగ్ అధికారులు చేస్తున్న ఫిర్యాదులపై కచ్చితమైన దర్యాప్తు జరిపించాలని, దోషులను పట్టుకొని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో ప్రకటించాలని కోరారు. ఆరెస్టులు, శిక్షలు లేవు కాబట్టి, ఏం చేసినా చెల్లుతుందనే ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారని ప్రతీ చెక్‌డ్యామ్ కోసం గ్రామాల్లో రక్షక దళాలు చేయాలని కోరారు.
చెక్‌డ్యామ్‌ల ధ్వంసంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తామని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ సీతారామారావు తెలిపారు. ప్రభుత్వం జలవనరుల సంరక్షణ చట్టాన్ని తీసుకు రావాలని కోరారు. రాష్ట్రంలో జలవనరుల సంరక్షణ ఉద్యమం చేపట్టాల్సి వస్తున్నదని చెప్పారు. చెక్‌డ్యామ్‌ల ధ్వంసంపై పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడుతామని, ప్రజాఉద్యమంగా నిర్మిస్తామని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు కష్టపడి జలవనరుల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. చెక్‌డ్యామ్‌లను బాంబులతో కూల్చి వేయడం అంటే మామూలు నేరం కాదని, ప్రభుత్వ పెద్దల సహకారంతో ఇసుక మాఫియా లాభాల కోసమే ఇదంతా జరుగుతున్నట్టు అర్థమవుతున్నదని ఫిషరీస్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ పిట్టల రవీందర్ ఆరోపించారు.
ఇప్పటికైనా మిగిలిన 20 చెక్‌డ్యామ్‌ల రక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని, లేకపోతే ప్రభుత్వమే కూల్చి వేస్తున్నదా? అనే ప్రజలకు అనుమానాలు కలుగుతాయని అన్నారు. అడవి సోమన్‌పల్లి చెక్‌డ్యామ్‌తో మానేరు ప్రాంత రైతులు సమృద్ధిగా పంటలు పండించుకున్నారని తెలిపారు. దాదాపు 300 మంది మత్స్యకారుల కుటుంబాలకు జీనోపాధి దొరికిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌ను నాశనం చేస్తూ సీమాంధ్రకు అప్పజెప్తూ, చెక్‌డ్యామ్‌లు ధ్వంసంతో విధ్వంస పాలనను కొనసాగిస్తున్నదని తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు మల్లోజుల విజయానంద్ విమర్శలు గుప్పించారు.
చెక్‌డ్యామ్‌ల ధ్వంసంలో ఇసుక మాఫియా హస్తం ఉన్నదని, ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన వారు ఉంటారని ఆరోపించారు. హుస్సేన్మియావాగులోని చెక్‌డ్యామ్‌ను ధ్వంసం చేయడానికి కొంత మంది కుట్ర పన్నగా, అక్కడి రైతులు అప్రమత్తమై చెక్‌డ్యామ్‌ను కాపాడుకున్నారని చెప్పారు. కానీ అక్కడ పోలీసులు ఎలాంటి విచారణ జరపలేదని మండిపడ్డారు. రైతులంతా అప్రమత్తం కావాల్సిన అవసరమున్నదని, చెక్‌డ్యామ్‌లు లేకపోతే మళ్లీ జలవనరులు అడుగంటి పోయి, పంటలు పండని పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు.
అడవి సోమన్‌పల్లిలో ధ్వంసమైన చెక్‌డ్యామ్ వద్ద శనివారం ఫోరెన్సిక్ విభాగం నిపుణులు శాంపిళ్లను సేకరించారు. ఈ నెల 17న చెక్‌డ్యామ్ ధ్వంసమైనట్టు ఇరిగేషన్‌శాఖ నుంచి మంథని ఏఈ నిఖిల్ కొయ్యూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు 18న కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్ ఎక్స్పర్ట్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటరాజ్యం ఆధ్వర్యంలో సిబ్బంది అడవి సోమన్పల్లికి వెళ్లి శిథిలాల శాంపిళ్లను సేకరించారు. భూపాలపల్లి జిల్లా క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ మార్కండేయ ఆధ్వర్యంలో ఆధారాలను సేకరించారు. ఈ సందర్భంగా కాటారం డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ అడవి సోమన్‌పల్లి చెక్‌డ్యామ్ విషయంపై ఇరిగేషన్ అధికారులు తమకు ఫిర్యాదు చేశారని, ఎక్స్పర్ట్స్ శాంపిళ్లను సేకరించి విచారణను ప్రారంభించారని తెలిపారు.
సారంగాపూర్, డిసెంబర్ 20: జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కండ్లపల్లి గ్రామ శివారులోని గంటన్న చెరువు తూము చానల్ గేట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శనివారం విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ తొగిటి సత్తవ్వ సంబంధిత ఎస్పారెస్పీ అధికారులకు సమాచారం అందించారు. ఎస్సారెస్పీ డీఈ చక్రునాయక్, ఏఈ అనిల్, వర్క్ ఇన్స్పెక్టర్ మోహన్ ఘటనా స్థలానికి చేరుకొని, తూము కట్టను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు చెరువులోని నీటిని బయటకు పంపేందుకు చెరువు కట్ట చానెల్ గేట్‌ను ధ్వంసం చేయడానికి యత్నించారని అధికారులు గుర్తించారు. ఈ విషయంపై ఏఈ అనిల్ బీర్పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.