హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : మార్చిలో నిర్వహించే పదో తరగతి పబ్లిక్ పరీక్షల టైంటేబుల్పై బాలల హక్కుల సంక్షేమ సంఘం అభ్యంతరం వ్యక్తంచేసింది. విద్యాశాఖ విడుదల చేసిన పదో తరగతి పరీక్షలను నెల రోజులపాటు నిర్వహించడంలో ఎలాంటి హేతుబద్ధత లేదని విమర్శించింది. పరీక్ష పరీక్షకు మధ్య గరిష్ఠంగా 4 రోజుల వ్యవధి, సాంఘికశాస్త్రం పరీక్షకు 5 రోజుల వ్యవధి ఉండటం సరికాదని పేర్కొన్నది. ఈ షెడ్యూల్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల మానసిక పరిస్థితులపై ప్రభావం చూపుతుంది అని బాలల హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంజమూరి రఘునందన్ తెలిపారు.
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చెప్పినట్టుగా, కొత్త షెడ్యూల్ విధానం వల్ల విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించడం సంగతి పక్కన పెడితే, విద్యార్థుల విలువైన సమయాన్ని వృథా చేయడమే అని పేర్కొన్నారు. పరీక్షలకు మధ్య ఎక్కువ రోజుల సమయం ఇవ్వడం వల్ల విద్యార్థులకు విసుగు, నిరుత్సాహం వంటివి కలుగుతాయని, తీవ్ర మానసిక ఆందోళనకు కూడా గురవుతారని వాపోయారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను పునఃసమీక్షించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.