హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): బీసీ కులవృత్తిదారులకు ఇస్తున్న ‘లక్ష’ సాయంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పలు కార్పొరేషన్ల చైర్మన్లు పేర్కొన్నారు. మాసబ్ ట్యాంక్‌లోని గొర్రెల మేకల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ ముదిరాజ్, కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, టెక్స్టైల్స్ అభివృద్ధి సంస్థ చైర్మన్ గూడూరి ప్రవీణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సహాయ సహకారాల ఫలితంగా రాష్ట్రంలో లక్షలాదిమంది చేతివృత్తిదారులకు లబ్ధి కలుగుతున్నదని కొనియాడారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలను లబ్ధిదారులకు సరైన రీతిలో అందేలా కార్పొరేషన్లు, ఫెడరేషన్ల తరఫున తమ వంతు కృషిని కొనసాగిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు.. వాటి ఫలితంగా అనుభవంలోకి వస్తున్న ఫలితాలను ప్రజలకు చేరవేసేందుకు ప్రతి ఒకరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ నాయకత్వంలో బీసీలతోపాటు దళిత, మైనారిటీ, గిరిజన, ఆదివాసీ, మహిళ, దివ్యాంగుల అభ్యున్నతికోసం తొమ్మిదేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడారు. పథకాలను, వాటికి సంబంధించి ప్రజల అనుభవంలోకి వచ్చిన విషయాలను ప్రజాక్షేత్రంలో ప్రచారం నిర్వహించేందుకు నిర్దిష్టమైన కార్యాచరణను రూపొందించడం కోసం కార్పొరేషన్లు, ఫెడరేషన్లు, ఇతర నామినేటెడ్ సంస్థల చైర్మన్లందరితో ఒక ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించుకోవాలని యోచిస్తున్నట్టు చెప్పారు.