హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): నీటి వనరులను సంరక్షించుకోవడంతోపాటు వాటిని సమర్థంగా వినియోగించుకోవాలని, అందుకు రాష్ర్టాల మధ్య పరస్పర సహకారం అవసరమని జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) చైర్మన్ భూపాల్ సింగ్ స్పష్టం చేశారు. నీటివనరుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ ఏటా ‘ఇండియా వాటర్ వీక్’ (ఐడబ్ల్యూడబ్ల్యూ) పేరుతో వారోత్సవాలను నిర్వహిస్తున్నది.
అందులో భాగంగా ఈ ఏడాది ‘నీటి అభివృద్ధి-నిర్వహణలో సమిష్టి భాగస్వామ్యం-సహకారం’ అనే థీమ్‌తో వచ్చే నెల 17-29 వరకు ఢిల్లీలో నిర్వహించతలపెట్టిన 8వ వారోత్సవాలకు సంబంధించిన సన్నాహాక సమావేశాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) చైర్మన్ ముఖేశ్ కుమార్ సిన్హా చేతులమీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భూపాల్ సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో నీటిసమస్యలను పరిష్కరించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా నదుల అనుసంధాన ప్రాజెక్టులను ఉదాహరించారు.
కార్యక్రమంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అతుల్ జైన్, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ అనిల్ కుమార్, సీఈ మోహన్ కుమార్, ఈఈ సుబ్రహ్మణ్య ప్రసాద్, చీఫ్ ఇంజినీర్ దేవేందర్‌రావు, ఎన్‌డబ్య్లూడీఏ డీడీ లలిత, వివిధ రాష్ట్రాల అధికారులు, కేంద్ర ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.