హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరీక్షించేందుకు మూడేండ్లకొకసారి కేంద్రం నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వే(న్యాస్) పరీక్ష పేరును కేంద్రం మార్చింది. ఈ ఏడాది ఫెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్-రాష్ట్రీయ సర్వేక్షన్-24 (పరాస్) పేరుతో ఈ సర్వేను నిర్వహించనున్నారు.
ఈ పరీక్ష జాతీయంగా 4న జరగనుంది. 3,6 9 తరగతుల్లోని విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఆర్టీ)కి అప్పగించారు. రాష్ట్రంలో ఎంపికచేసిన 3,500 స్కూళ్లల్లో మాత్రమే ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో ఉదయం 10:30గంటలకే పరీక్షను ప్రారంభిస్తారు.
అవి తాతాలిక డిప్యూటేషన్లే.. నర్సింగ్ విభాగం డీడీ విద్యుల్లత వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 1, (నమస్తే తెలంగాణ) : నూతనంగా ఏర్పాటు చేసిన 16 నర్సింగ్ కాలేజీల్లో ఇటీవల భర్తీ చేసిన పోస్టులు తాతాలిక డిప్యూటేషన్లు మాత్రమే అని నర్సింగ్ విభాగం డీడీ విద్యుల్లత తెలిపారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘నర్సింగ్‌లో అక్రమాలు’ అనే వార్తకు ఆమె స్పందించారు. డిప్యూటేషన్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టంచేశారు.
ఇప్పటికే విద్యార్థులు కాలేజీల్లో చేరుతున్న నేపథ్యంలో కౌన్సెలింగ్ నిర్వహించి సీనియర్లను కేటాయించేంత సమయం లేదని తెలిపారు. అందుకే తాతాలిక ప్రాతిపదికన డిప్యూటేషన్లు ఇచ్చామని వెల్లడించారు. ఇవి రెండు మూడు నెలల వరకు మాత్రమే పరిమితం అని చెప్పారు. త్వరలో సీనియర్లను ఆయా కాలేజీలకు శాశ్వతంగా బదిలీ చేస్తామని పేర్కొన్నారు.