న్యూఢిల్లీ, ఆగస్టు 16: గత కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లే కాదు.. మాజీ ప్రధానుల పేర్లను సైతం మోదీ సర్కార్ తొలగిస్తున్నది. ‘నెహ్రూ మెమోరియల్ మ్యూజి యం, లైబ్రరీ’ (ఎన్ఎంఎంఎల్) పేరులో ‘నెహ్రూ’ పేరును తొలగిస్తూ..‘పీఎం మ్యూజియం, లైబ్రరీ’ (పీఎంఎంఎల్) అనే కొత్త పేరును ఖరారు చేసింది. ఈ విషయాన్ని ‘పీఎంఎంఎల్’ వైస్ చైర్మెన్ ఏ సూర్యప్రకాశ్ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా బుధవారం అధికారికంగా వెల్లడించారు. నెహ్రూ మ్యూజియంకు ఉపాధ్యక్షుడుగా ఉన్న రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో పేరు మార్పుపై నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. మాజీ ప్రధానుల సేవలను కొనియాడుతూ గత ఏడాది కేంద్రం ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. ఇందుకోసం నెహ్రూ మ్యూజియం భవనంలో అనేక మార్పులను చేపట్టింది. ‘ఎన్ఎంఎంఎల్’ను మాజీ ప్రధానుల స్మారక కేంద్రంగా కొనసాగిస్తున్నది.
నెహ్రూ మెమోరియల్ పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. నెహ్రూ ఘనమైన వారసత్వాన్ని, దేశానికి అందించిన సేవల్ని ‘నిరాకరించటం, నిందించటం’ అనే ఏకైక ఎజెండాతో మోదీ సర్కార్ ముందుకు వెళ్తున్నదని, తద్వారా తన అల్పత్వాన్ని చాటుకుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ స్పందిస్తూ, ‘దేశ తొలి ప్రధాని నెహ్రూ పేరు వింటేనే ప్రధాని మోదీకి అభద్రతా భావం ఏర్పడుతున్నది. నెహ్రూ ఘనమైన వారసత్వం కనపడకూడదన్న ఉద్దేశంతో మోదీ సర్కార్ సంకుచితంగా వ్యవహరిస్తున్నది. దాంట్లో భాగంగానే నెహ్రూ మెమోరియల్ పేరును తొలగించింది’ అని అన్నారు.