హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ప్రపంచ అగ్రశ్రేణి సంస్థల రాక.. పెట్టుబడుల వెల్లువ.. పెద్దఎత్తున పరిశ్రమల స్థాపన.. విస్తరణతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ డబు ల్ కానున్నదని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అంచనా వేసింది. 2031-32 కల్లా రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ 1,20,549 మిలియన్ యూనిట్లకు చేరుతుందని సంస్థ లెక్కగట్టింది. ప్రస్తుతానికి ఏటా 70,871 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతుండగా రానురాను అవసరాలు పెరుగుతాయని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ తెలిపింది. ఇటీవలి సీఈఏ ఎలక్ట్రిక్ పవర్ సర్వే(ఈపీఎస్) నివేదికలో ఆసక్తికరమైన ఈ విషయాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 14,176 మెగావాట్లు, వినియోగం 70,871 మిలియన్ యూనిట్లుగా ఉండగా.. తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం 2021 యూనిట్లు. ఇది దేశ సగటు కంటే అధికం కావటం విశేషం.
ప్రస్తుతానికి రాష్ట్రంలో స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 18,567 మోగావాట్లు. విద్యుత్తు డిమాండ్ తీవ్రం కానున్న నేపథ్యంలో ఉత్పత్తిని రెట్టింపు చేయాల్సి ఉన్నది. అందుకే నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను ప్రభుత్వం ముందుచూపుతో నిర్మిస్తున్నది. సౌర విద్యుత్తు వినియోగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నది. నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ అంచనాల ప్రకారం తెలంగాణ 2022-32 కాలంలో విద్యుత్తు వినియోగం 58.71 శాతం పెరగనున్నది. ముందుగా మేల్కొన్న విద్యుత్తుశాఖ అధికారులు భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసి అమలుచేస్తున్నారు. ఇక ఈపీఎస్ నివేదిక ప్రకారం 2026-27 వరకు జాతీయ గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 277.2 గిగావాట్లకు చేరుతుంది. 2031-32 కల్లా 366.4 గిగావాట్లకు చేరుతుందని సంస్థ అంచనావేసింది. తెలంగాణ గుండెకాయ వంటి, గ్రోత్ ఇంజిన్ అయిన హైదరాబాద్లో విద్యుత్తు వినియోగం 2029 -30 కల్లా 39 వేల మిలియన్ యూనిట్లుకు చేరే అవకాశమున్నట్టుగా ఈపీఎస్ అంచనా కట్టింది.