హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ)/కొండాపూర్ : కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం(ఎన్ఈపీ)పై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం మాదాపూర్ హెచ్ఐసీసీలో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) నిర్వహించిన ‘స్కూల్ లీడర్షిప్ సమ్మిట్, ఎడ్ఎక్స్’ను వినోద్‌కుమార్ ప్రారంభించి మాట్లాడారు. ఎన్ఈపీ, నీట్‌లపై తమిళనాడు సహా పలు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని, కేంద్రం ఆయా రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, అభిప్రాయ సేకరణ చేపట్టాలని కోరారు. రాష్ర్టాల్లో ఎదురవుతున్న సమస్యలపై తగిన నిర్ణయాలు తీసుకోకుండా నూతన విద్యావిధానాల అమలు సాధ్యం కాదన్నారు. కొవిడ్ కారణంగా రెండేండ్లపాటు విద్యా వ్యవస్థ ఎంతో నష్టపోయాయిందని, విద్యార్థులు చదివిన అంశాలు మరిచిపోయారన్నారు. కొంతమంది తెలుగులో పేర్లు సైతం రాయలేకపోతున్నారన్నారు. 2022-23 విద్యాసంవత్సరాన్ని అభ్యసననష్టాన్ని పూడ్చే సంవత్సరంగా ప్రకటించాలని వినోద్‌కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. రెండు రోజులపాటు కొనసాగే ఎడ్ఎక్స్ సదస్సులో నూతన విద్యావిధానం, నాయకత్వ అభివృద్ధి, సైకలాజికల్ లిటరసీ, ఎదురయ్యే సవాళ్లు తదితర అంశాలపై చర్చించనున్నారు. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, నాయకులు మధుసూదన్, రమణారావు, ప్రసాద్‌రావు, కోరెం సంజీవరెడ్డి, యాదగిరి, సయ్యద్ అహ్మద్, జనార్దన్, శ్రీకాంత్‌రెడ్డి, బీరప్ప, వోడ్నాల శ్రీనివాస్‌తో పాటు ఏపీ, ఢిల్లీ తదితర రాష్ర్టాల ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు సదస్సులో పాల్గొన్నారు.
ఈ పెన్ను మాట్లాడుతుందండోయ్..
మాట్లాడే పక్షులను చూశాం.. రోబోలను చూశాం.. చివరికి మాట్లాడే బొమ్మలను కూడా చూశాం.. కానీ, మాట్లాడే పెన్నును ఎవరైనా చూశారా? పెన్నేంటి.. మాట్లాడటమేంటి అనుకుంటున్నారా.. అవును మీరు చదువుతున్నది నిజమే. పుస్తకంలోని పదాలు, వాక్యాలను చదివే టాకింగ్ పెన్నును హైదరాబాద్‌కు చెందిన ‘మేలు’ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆదివారం మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) నిర్వహించిన స్కూల్ లీడర్షిప్ సమ్మిట్, ఎడ్ఎక్స్ సమ్మిట్‌లో ప్రదర్శించింది. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ పెన్ను మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నది. అయితే, ఈ పెన్ను అన్ని పుస్తకాలను చదవలేదు. కోడింగ్ ఆధారంగా తయారుచేసిన స్మార్ట్ ఇంటరాక్టివ్ బుక్స్‌ను మాత్రమే చదువుతుందని మేలు సంస్థ మార్కెటింగ్ హెడ్ కే శ్రీధర్ వివరించారు. నర్సరీ నుంచి 3వ తరగతి విద్యార్థులకు ఈ పెన్ను, స్మార్ట్ ఇంటరాక్టివ్బుక్స్ ద్వారా పాఠాలు బోధించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 300లకు పైగా పాఠశాలల్లో వీటిని వినియోగిస్తున్నట్టు శ్రీధర్ తెలిపారు. పుస్తకాలు, పెన్ను ధర రూ. 5 వేల వరకు ఉంటుందని చెప్పారు.