హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): మట్టినే నమ్ముకొని కాయకష్టం చేసే రైతుల నోట్లో కేంద్రం మట్టి కొడుతున్నది. ఓవైపు మార్కెట్లను మూసివేస్తూ… మరోవైపు ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోళ్లను బంద్ చేస్తూ రైతులు పంటలను అమ్ముకొనే దారి లేకుండా చేస్తున్నది. ఇప్పటికే పండిన పంటలకు మద్దతు ధర లభించక, కొనుగోలు చేసే దిక్కు లేక నానా తంటాలు పడుతున్న రైతులకు, బీజేపీ సర్కారు తాజా నిర్ణయం అశనిపాతంగా మారనున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆహార పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో ఇకపై ప్రైవేటు వ్యాపారులను కూడా అనుమతించాలన్న నిర్ణయం వ్యవసాయ ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తుందని రైతు సంఘాలు అంటున్నాయి. పంటలను ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తే రైతులకు న్యాయం జరుగుతుందా? మద్దతు ధర లభిస్తుందా? సరైన సమయంలో డబ్బులు అందుతాయా? మొత్తం పంటను కొనుగోలు చేస్తారా? ఒకవేళ ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేయకపోతే రైతులు ఎక్కడ అమ్ముకోవాలి? ఎవరు కొనాలి? అని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
వ్యవసాయరంగాన్ని పూర్తిగా ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు రైతుకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్తూనే మరోవైపు సాగును సర్వనాశనం చేసేలా నిర్ణయాలు తీసుకొంటున్నది. ఆహార భద్రత దేశ ప్రజల హక్కు అని, పంటలు పండించటం రైతుల హక్కు అని రెండురోజుల క్రితమే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. అంతలోనే పంట కొనుగోళ్ల నుంచి కేంద్రం తప్పుకొని ప్రైవేటు వ్యాపారులకు అప్పగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
రైతులను రోడ్డున పడేసేందుకే మోదీ సర్కారు గతంలో నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. రైతులు తమ పంటలను అమ్ముకొనే మార్కెట్లను మూసివేసేలా ఆ చట్టాల్లో నిబంధనలు ఉన్నాయి. ఆ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు తిరగబడటంతో ప్రధాని నరేంద్రమోదీ జాతికి క్షమాపణ చెప్పిమరీ ఆ చట్టాలను వెనక్కి తీసుకొన్నారు. మళ్లీ ఇప్పుడు మరో కుట్రకు తెరలేపారు. ఆహార ఉత్పత్తుల కొనుగోళ్లలో ప్రైవేటు వ్యాపారులకు కూడా భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించారు. ఇదే జరిగితే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్ల నుంచి పూర్తిగా తప్పుకొని ప్రైవేటు వ్యాపారులకు అప్పగించే ప్రమాదం ఉన్నది. దీంతో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఖాయమనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో పూర్తిగా విఫలమైన కొనుగోళ్ల విధానాన్ని మోదీ సర్కారు మళ్లీ రైతులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నది. 2014కు ముందు రైతుల నుంచి ధాన్యాన్ని ఎఫ్సీఐ తరఫున మిల్లర్లే కొనుగోలు చేసేవారు. రైతులకు మద్దతు ధర ఇస్తున్నట్టు నమ్మించేవారనే విమర్శలున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొనేవారు. దీంతో ఆ విధానాన్ని రద్దుచేసి నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. సజావుగా సాగుతున్న ఈ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ ప్రైవేటు వ్యాపారులను జొప్పించాలని చూస్తున్నది. ఈ నిర్ణయం ఇప్పటికే సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వ్యవసాయరంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలనే అమలు చేస్తున్నది. బాయిల్డ్ రైస్ తీసుకోబోమంటూ రైతులకు నష్టం చేసింది. పూర్తిగా పంటల కొనుగోళ్ల నుంచి తప్పించుకొనే కుట్ర చేస్తున్నది. రైతులకు మద్దతు ధర దక్కకుండా చేస్తున్నది. అన్ని పంటలను పూర్తి మద్దతు ధరతో రైతుల నుంచి కొనుగోలు చేయాలి.
-గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి
వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకొంటున్నది. మూడు నల్ల చట్టాలతో వారి ఆటలు సాగకపోవడంతో ఇప్పుడు దొడ్డి దారిన కొత్త కుట్రలు చేస్తున్నది. కొనుగోళ్లలో ప్రైవేటు వ్యాపారులను అనుమతిస్తే రైతులకు మిగిలేది కష్టాలు, కన్నీళ్లే. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యవసాయరంగాన్ని సంక్షోభంలోకి నెట్టే కుట్రలు మానుకొని, రైతులకు మంచి చేసే నిర్ణయాలు తీసుకోవాలి.
-కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక నేత