Vizag Steel Plant | స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం మళ్లీ మాట మార్చింది. వీఎస్పీని ప్రైవేటీకరించటం లేదని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ప్రకటించి ఒక్క రోజు తిరగకముందే నిర్ణయాన్ని మార్చుకొన్నది. శుక్రవారం సాయంత్రం కేంద్ర ఉక్కు శాఖ విడుదల చేసిన ప్రకటనలో ‘రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆగిపోలేదు.. పురోగతిలో ఉన్నది. మరింత మెరుగు పరుచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెలుగు రాష్ర్టాల్లో చర్చనీయంశంగా మారిన విషయం తెలిసిందే. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై ఆంధ్రప్రదేశ్‌లోని పాలక, ప్రతిపక్ష పార్టీలు నోరు మెదపకపోయినా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ నేపథ్యంలో గురువారం విశాఖకు వచ్చిన కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్ స్పందిస్తూ విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకువెళ్లడం లేదని తెలిపారు. బీఆర్ఎస్ హెచ్చరిక తర్వాతనే కేంద్రం దిగివచ్చిందని సంస్థ కార్మికులు, ప్రజా సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు అభినందించటంతో, బీఆర్ఎస్కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న కుట్రతో కేంద్రం శుక్రవారం మాట మార్చిందని కార్మికులు ఆరోపిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై వీఎస్పీ కార్మికులు, ఉద్యోగులు భగ్గుమన్నారు. శుక్రవారం విశాఖలోని కూర్మన్నపాలెం జాతీయ రహదారిపై కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీఎస్పీ ప్రైవేటీకరణ యోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఎన్ని కుట్రలు పన్నినా ప్లాంట్‌ను కాపాడుకుంటామని స్పష్టంచేశారు.