చిట్యాల, అక్టోబర్ 11 : సిమెంటు లారీ బ్రిడ్జిని ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన శుక్రవారం ఉదయం నల్లగొండ జిల్లా చిట్యాలలో 65వ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ వైపు నుంచి సిమెంటు లోడ్ లారీ హైదరాబాద్ వైపు వెళ్తున్నది. ఆ లారీ చిట్యాలలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిని దాటిన తర్వాత ఉన్న బ్రిడ్జిని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డీజిల్ ట్యాంకు బ్రిడ్జికి తగిలి పేలిపోవటంతో మంటలు చెలరేగి లారీ దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రోడ్డుపై లారీ దగ్ధం కావడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దాంతో పోలీసులు ట్రాఫిక్‌ను ఒకే వైపు మళ్లించి, దగ్ధమైన లారీని అడ్డు తొలగించారు. ఈ ఘటనపై ఫిర్యాదు రానందున కేసు నమోదు చేయలేదని ఎస్సై తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): వెంకట్ నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ (వీఎన్ఈఎస్) లైసెన్సును రద్దు చేసినట్టు మహబూబ్ కాలేజ్(మల్టీపర్పస్ హైయర్ సెకండరీ సూల్ సొసైటీ) శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. స్వా మి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎస్వీఐటీ), స్వామి వివేకానంద పీజీ కాలేజ్(ఎస్వీపీజీ), బాల్టన్ సూల్ వంటి విద్యాసంస్థలు ఇప్పటివరకు వీఎన్ఈఎస్ ఆధ్వర్యంలో నడిచాయని, ప్రస్తు తం తమ నియంత్రణలోకి తీసుకున్నట్టు మహబూబ్ కాలేజ్ తెలిపింది. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వచ్చినట్టు పేర్కొన్నది. వీ ఎన్ఈఎస్ అధ్యక్షుడు డాక్టర్ కేవీకే రావు, ఆయన కుమారుడుకే శ్రీహర్ష శశాంక్, సభ్యుల జోక్యం, బెదిరింపుల కారణంగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సి వచ్చినట్టు మహబూబ్ కాలేజ్ తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, బోధన, బోధనేతర సిబ్బంది వీఎన్ఈఎస్ సభ్యుల నుంచి వచ్చే సందేశాలకు స్పందించొద్దని సూచించింది.