వీర్నపల్లి/ కోనరావుపేట, జనవరి 25: ఏ తల్లికైనా బిడ్డలంటే అమితమైన ప్రేమ.. మనుషులే కాదు, మూగజీవాలైనా తల్లి ప్రేమలో ఇసుమంత తేడా ఉండదు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఘటన కన్నీరు పెట్టించింది. తన కండ్ల ముందే చిరుతకు చికి బలైన తన బిడ్డను చూసి, ఆ గోమాత కార్చిన కన్నీరు మాతృత్వానికి సా క్ష్యంగా నిలిచింది. చనిపోయిన ఆ లేగ దూడ బతుకకపోతదా అనుకొని ఆ మూగజీవి, తన ఇంటికి వెళ్లి మరీ యజమానిని తీసుకొచ్చింది. ఆ లేగదూడ చుట్టే తిరుగుతూ కంటతడి పెట్టడం కలచివేసింది. మూడేండ్ల క్రితం ఆ ఆవు పుట్టగానే తల్లిని కోల్పోయింది.
ఎర్రగడ్డ తండాకు చెందిన బానోత్ రాజు.. బర్రెపాలు పోసి, రొట్టెలు పెట్టి ప్రేమగా సాకగా, ఆరు నెలల క్రితమే లేగదూడకు జన్మనిచ్చింది. ఎప్పటిలాగే శనివారం ఉదయం ఆవు, లేగదూడ మందతో కలిసి బాబాయ్ చెరువు తండాను ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతానికి మేతకు వెళ్లింది. తల్లి వెంటే అడుగులో అడుగేస్తూ దూడ నడిచింది. అదే సమయంలో ఓ చిరుత ఒకసారిగా దూడపై దాడి చేయగా, ‘అంబా.. అంబా’ అంటూ విలవిల్లాడింది. చివరకు ప్రాణాలు వదిలేసింది. ఆ క్రూరమృగం తన ఆకలి తీర్చుకొని వెళ్లిపోగా, ఆ గోమాతకు గుండెకోతే మిగిలింది. కండ్లముందే బిడ్డ ప్రాణాలు పోతోంటే తల్లడిల్లిపోయింది.
రక్తపు మడుగులో పడి ఉన్న తన బిడ్డను చూసి కన్నీరుపెట్టింది. తన నాలుకతో దూడ శరీరాన్ని నిమురుతూ.. ‘అంబా.. ఆ’ అంటూ అక్కడే కొద్ది సేపు అరిచింది. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో ఇంటి బాట పట్టింది. తన యజమాని రాజును తలతో నిమురుతూ అక్కడే తిరగసాగింది. అనుమానం వచ్చిన యజమాని దాని వెంటే నడువగా.. అడవిలో మృతిచెందిన బిడ్డ కళేబరం వద్దకు తీసుకు వెళ్లింది. మృతిచెందిన బిడ్డను చూపిస్తూ కండ్లలో కన్నీళ్లు ధారలుగా పారించింది. అది చూసిన యజమాని సైతం కంటతడి పెట్టగా, ఈ దృశ్యం అకడికి వచ్చిన అటవీ శాఖ అధికారులను సైతం కలిచివేసింది.