రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ)/ వేములవాడ : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. కార్నర్ మీటింగ్‌లతో కాంగ్రెస్, బీజేపీలను హడలెత్తిస్తున్నది. ఓవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మరోవైపు పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. ‘నేనున్నా’నంటూ భరోసా ఇస్తూ బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో ఆదరణ చూరగొంటున్నారు. ఆయాచోట్ల ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ.. అండగా నిలుస్తామని భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు. ‘బీఆర్ఎస్ వెంటే ఉంటాం.. కారు గుర్తుకే ఓటేస్తాం’ అంటూ అన్ని వర్గాల ప్రజలు గులాబీ నేతల వెంటే కదులుతున్నారు.
సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో కేటీఆర్ రెండో రోజు ఎన్నికల ప్రచారం చేయగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. మరోవైపు హరీశ్‌రావు రెండు రోజులుగా ప్రచారంలో భాగంగా మహిళలతో ముఖాముఖి సమావేశం పెట్టి కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు. కార్మిక, ధార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఎన్నికల ప్రచారం చేయగా ప్రజలు నీరాజనం పలికారు. గురువారం సిరిసిల్లలోని 21 వార్డుల్లో ప్రచారం చేసిన ఆయన, రెండోరోజు శుక్రవారం సైతం అదే జోరు కొనసాగించారు.
శుక్రవారం ముందుగా వేములవాడలో ప్రచారం చేసి, ఆ తర్వాత సిరిసిల్లలో పర్యటించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు వేములవాడలోని తిప్పాపూర్‌కు కేటీఆర్ చేరుకోగా ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. వేములవాడలో 28 వార్డులకు సంబంధించి తిప్పాపూర్, అమరవీరుల స్తూపం, తెలంగాణ చౌక్‌లో కేటీఆర్ నిర్వహించిన సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఎన్నికల హామీలో భాగంగా ఆది శ్రీనివాస్ 2023లో రాసిచ్చిన బాండ్ పేపర్‌ను చూపుతూ కేటీఆర్ ప్రసంగిస్తుండగా మహిళలు ఆసక్తిగా తిలకించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఒక్కో హామీని వివరిస్తూ ప్రభుత్వం నుంచి ప్రజలకు రావాల్సిన బకాయిలను వివరించిన తీరుపై మహిళలు చప్పట్లతో హర్షం వ్యక్తంచేశారు.
మద్దతుగా పిడికిలి బిగించి నినాదాలు చేశారు. 12:30 గంటల నుంచి రెండున్నర గంటల వరకు సుమారు రెండు గంటల పాటు జరిగిన సభలు విజయవంతం కాగా, మధ్యాహ్నం 3 గంటలకు కేటీఆర్ సిరిసిల్లకు వెళ్లారు. ఇటీవల మున్సిపాలిటీలో విలీనమైన పెద్దూరు పరిధిలోని బాబాజీ కాలనీలో మహిళలు, కాలనీవాసులతో కలిసి కిందే కూర్చున్నారు. చాలా సేపు ఇష్టాగోష్టి నిర్వహించారు. తులం బంగారం వచ్చిందా? కేసీఆర్ కిట్ వచ్చిందా? మహిళలకు రూ.2,500 వచ్చినయా? ముసలోళ్లలకు రూ 4 వేలు పింఛన్ ఇచ్చిండ్రా.. రైతు బంధు ఏసిండ్రా? అని అడుగడంతో కాలనీవాసులు రాలేదని సమాధానం చెప్పారు.
అకడి నుంచి బయలు దేరిన కేటీఆర్ ఆ తర్వాత వివిధ వార్డులు క లియ తిరుగుతూ ప్రచారం చేశారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో నేతన్నల సంక్షేమానికి తీసుకున్న చర్యలు, ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన కృషిని వివరించారు. అలాగే రెండేండ్లుగా కాంగ్రెస్ చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టారు. ఆయాచోట్ల రామన్నకు నేతన్నలు, రైతులు, కార్మికులు, యువతీ యువకులు, మహిళలు జేజేలు పలికారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్, జిన్నారంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహించారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను మహిళలు హరీశ్‌కు వివరించారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగున్నదని అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ నేతల ఎదుట స్పష్టంచేస్తున్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని, తమకు మంచి రోజులు రావాలని ఆకాంక్షిస్తున్నారు.