హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన బ్రేక్‌ఫాస్ట్ పథకం విస్తరణలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. లక్షలాది మంది విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం ప్రస్తుతం కొన్ని పాఠశాలలకే పరిమితమైంది. 26వేల బడుల్లో ఈ స్కీమ్ అమలుచేస్తామని సర్కార్ చెప్పినప్పటికీ ప్రస్తుతానికి 1,970 స్కూళ్లకే అమలైంది. స్కీమ్‌ను ఏడు విడతల్లో రాష్ట్రమంతటా విస్తరించాలని గడువుగా పెట్టుకున్నారు. మొదటి విడత మాత్రమే అమలైంది. ఇటీవలే మంథని, మధిర నియోజకవర్గాల్లో అమలుకు శ్రీకారం చుట్టారు. రెండో, మూడో విడత గడువులు ముగిశాయి. కానీ విస్తరణ నత్తను తలపిస్తున్నది. మిగిలిన బడుల్లో ఈ పథకం అమలు కావాలంటే వచ్చే విద్యాసంవత్సరం వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొన్నది.
ముగిసిన గడువులు..
ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఏడు విడతల్లో అమలుచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గడువులు ముగిసినా ఈ పథకం అమలు కావడంలేదు. ఆగస్టు ముగిసే వరకు 12,724 బడులకు ఈ పథకాన్ని విస్తరించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1,970 బడులకు మాత్రమే విస్తరించారు. జూన్ 21వరకు రాష్ట్రంలోని 8 జిల్లాలు, 49 మండలాల్లో 1,269 బడుల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జూలై 8న హైదరాబాద్‌లో 13, హనుమకొండలో 47 స్కూళ్లకు విస్తరించారు. జూలై 13న 97 బడులకు, జూలై 15న 30, 27న 274, ఆగస్టు 1న 76, 5వ తేదీన 46, 6న 60, 11న 58 స్కూళ్లకు విస్తరించారు.
17 నియోజకవర్గాలకు మూడే..
ఈ పథకం అమలు, సెంట్రలైజ్డ్ కిచెన్ల నిర్మాణానికి టెండర్లను ఇటీవలే సర్కార్ పూర్తిచేసింది. హరే రామ.. హరే కృష్ణ, మన్నాట్రస్టు, అక్షయపాత్ర సంస్థలకు అప్పగించింది. సెంట్రలైజ్డ్ కిచెన్ల నిర్మాణానికి ఆరు నెలలు గడువు విధించింది. అంటే డిసెంబర్లో ఈ కిచెన్ల నిర్మాణం పూర్తవుతుందన్న మాట. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు కేవలం మూడు సెంట్రలైజ్డ్ కిచెన్లు సరిపోతాయని అధికారులు అంచనావేశారు. 60 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉండగా, కిచెన్ నుంచి పాఠశాలకు ఆహారం చేరవేసేందుకు గరిష్ఠంగా గంటన్నర సమయం పడుతుంది. ఈ గంటన్నరలో వేడి వేడి బ్రేక్‌ఫాస్ట్ అందుతుందా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఒక్కరిపై రూ. 11.50-13.50
పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఐదో తరగతి వరకు గల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ కోసం రోజుకు రూ. 11.50, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గల విద్యార్థులకు రోజుకు రూ.13.50గా ధరలు నిర్ణయించారు. జూనియర్ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనుండగా, ఒక విద్యార్థికి రూ. 19.85గా ఖరారు చేశారు. బ్రేక్ ఫాస్ట్ పథకం అమలుకు రూ. 534.06 కోట్లు ఖర్చుచేయనున్నారు. ఐదో తరగతి లోపు విద్యార్థులకు 100 మిల్లీ లీటర్ల పాలు, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు గల విద్యార్థులకు 150 మిల్లీ లీటర్ల పాలు అందించనున్నారు. పాల కోసం రూ .199.4 కోట్లు ప్రభుత్వం వెచ్చించనున్నది. ఈ పాలను వేడిచేయడం, చక్కెర కలుపడం కోసం ఒక్కో విద్యార్థికి రూ.1.08 చొప్పున చెల్లిస్తారు.
