e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home తెలంగాణ దళిత బంధును ఆపే కుట్ర

దళిత బంధును ఆపే కుట్ర

 • సీఈసీకి గోనె, పద్మనాభరెడ్డి ఫిర్యాదు
 • బీజేపీ ఈటల సరికొత్త కుతంత్రం
 • దళిత బంధు పథకాన్ని ఆపేయాలంటూ ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ పద్మనాభరెడ్డి,
 • ఆర్టీసీ మాజీ చైర్మన్‌ గోనె ప్రకాశ్‌రావు ఈసీకి రాసిన ఈ లేఖలు
 • బీజేపీ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 • కాషాయ మాధ్యమాల్లో ఫిర్యాదు కాపీలు
 • దళిత పథకానికి ఆర్నెల్ల క్రితమే రూపకల్పన
 • బడ్జెట్‌లో నిధులు.. మార్చి 18నే అసెంబ్లీకి
 • బడ్జెట్‌తోపాటే పథకాన్ని ఆమోదించిన సభ
 • అప్పటికి హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఊసేలేదు
 • కరోనా సెకండ్‌వేవ్‌తో ఆలస్యమైన అమలు
 • ఓటమి భయంతో బీజేపీ ఈటల చిల్లరవేషాలు
 • దళితులకు మేలుచేసే పథకానికి మోకాలడ్డు
 • ఇలాంటి వేషాలతోనే గతంలో అభాసుపాలు

హైదరాబాద్‌, కరీంనగర్‌ ప్రతినిధి, జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో దళిత సమాజం సముద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన దళితబంధు పథకాన్ని ఆపేందుకు అప్పుడే కుట్ర మొదలైంది. ఎప్పుడో ఆరు నెలల క్రితం సంకల్పించి బడ్జెట్‌లో నిధులు కేటాయించి.. అసెంబ్లీ ఆమోదం పొంది.. లోతైన మేధోమథనం అనంతరం కార్యాచరణ చేపట్టిన దళితబంధు అమలుకు మోకాలడ్డటానికి ప్రతీఘాతశక్తులు దిక్కుమాలిన కుంతంత్రాలకు తెరతీశాయి. ఈ పథకానికి, హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ముడిపెట్టి అడ్డుకోవడానికి శాయశక్తులా కృషిచేస్తున్నాయి. బీజేపీ నేత ఈటల రాజేందర్‌ సన్నిహితులు, అనుచరులు కేంద్ర ఎన్నికల సంఘానికి వేర్వేరుగా ఫిర్యాదులు చేసి, పథకాన్ని నిలుపుదల చేయించే పనిలో పడ్డారు. ఆ ఫిర్యాదు కాపీలు బీజేపీ శ్రేణుల సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్‌ చేయించి.. దళితబంధు పథకం అమలు కాబోదన్న దుష్ప్రచారానికి ఒడిగడుతున్నారు. దళితబంధును ఆపాలంటూ.. హుజూరాబాద్‌లో వెంటనే ఉప ఎన్నికలు నిర్వహించాలంటూ ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ చైర్మన్‌గా వ్యవహరించిన గోనె ప్రకాశ్‌రావు, ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌కు చెందిన పద్మనాభరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు.

ఆర్నెళ్ల నాటి స్కీంపై అక్కసు

రాష్ట్రంలో దళితుల సాధికారతకోసం ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకొని రానున్నట్టు ఈ ఏడాది ఫిబ్రవరి పదో తేదీనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌కు అదనంగా వెయ్యి కోట్ల రూపాయలను ఈ ఏడాది కేటాయిస్తామని కూడా వెల్లడించారు. అన్నమాట ప్రకారం వార్షిక బడ్జెట్‌లో సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీం కోసం వెయ్యికోట్లను కేటాయించారు. దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీంపై అన్ని పార్టీల శాసనసభ్యులు ఏకగ్రీవంగా తమ ఆమోదాన్ని తెలిపారు. ఈ స్కీంను ఏ విధంగా అమలుచేయాలి? దీని రూపురేఖలు ఎలా ఉండాలి? అనే అంశాలపై అన్ని పార్టీల దళిత శాసనసభ్యులు, ప్రతినిధులు, అధికారులతో చర్చించి ఒక నిర్ణయానికి వద్దామని సీఎం కేసీఆర్‌ ఆనాడు శాసనసభలోనే విస్పష్టంగా ప్రకటించారు. అప్పటికి ఈటల రాజేందర్‌ ఆరోగ్యశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అప్పటికి రాజీనామా చేయలేదు.. హుజూరాబాద్‌ ఎన్నికా రాలేదు. ఆ తరువాత కరోనా వ్యాప్తి విస్తరించడం.. దాని నియంత్రణ, లాక్‌డౌన్‌ తదితర నియంత్రణ చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం తలమునకలైపోవడం అందరికీ తెలిసిందే. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వెంటనే దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీంపై ముఖ్యమంత్రి దృష్టిసారించారు. అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు మొన్నటికి మొన్న (జూన్‌, 27) దళిత సమాజానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీల ప్రతినిధులతో విస్తారమైన చర్చ జరిపి, ఈ స్కీంకు దళితబంధుగా నామకరణంచేశారు. ఆ తరువాత సీఎం కేసీఆర్‌కు సెంటిమెంట్‌గా భావిస్తున్న కరీంనగర్‌ జిల్లా హూజూరాబాద్‌ నుంచే ఈ పథకానికీ నాంది పలకాలని నిర్ణయించారు.

- Advertisement -

దేశానికే ఆదర్శంగా మారిన రైతుబంధు పథకానికి ఇక్కడినుంచే ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు దేశంలో అంబేద్కర్‌ ఆశించిన దళిత ఉన్నతికి దిక్సూచిగా మారనున్న దళితబంధును కూడా ఇక్కడినుంచే ప్రారంభించాలని ఆకాంక్షించారు. ఈ స్కీం రూపురేఖలపై కేవలం అధికారులు, ప్రజా ప్రతినిధులే కాదు.. స్వయంగా లబ్ధిదారులు ఏమని అనుకొంటున్నారో తెలుసుకోవడం కోసం అవగాహన సదస్సు కూడా నిర్వహించారు. వారినుంచే ఇన్‌పుట్‌లు స్వీకరించారు. దాని ప్రకారమే ఈ పథకానికి ఒక రూపాన్ని తీసుకొస్తున్నారు. ఈ సమావేశంలోనే ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ పథకం అమలుకు ఎలాంటి హడావుడి లేదని.. అన్ని కోణాల్లో విశ్లేషించి ఏ ఒక్క లబ్ధిదారుడు తిరిగి వెనక్కు చూసుకోకుండా సగర్వంగా తలెత్తుకొని నిలబడేలా ఉండేలా పథకం రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక గొప్ప పథకం గురించి ఇంత లోతుగా, ఇంత తీవ్రంగా కసరత్తు జరుగుతుంటే.. ఒక నియోజకవర్గం ఉప ఎన్నికతో ముడిపెట్టడం మోకాలికి బోడిగుండుకీ ముడిపెట్టడం కాదా! అని సామాజిక విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఓ దళితుడి పోస్టింగ్‌

పథకాన్ని అడ్డుకోగలరా?

విపక్షనేతలు.. సోకాల్డ్‌ సుపరిపాలన ఫోరం నేతలు వ్యవహరించే తీరు విచిత్రంగా ఉన్నది. దళితబంధు పథకానికి రూపకల్పన ఎప్పుడు జరిగిందో కూడో తెలియనితనంతో.. తెలివితక్కువగా మాట్లాడుతున్నారు. ఈటల అనుచరగణం ఎన్నికల సంఘానికి లేఖలు రాయడం వల్ల ఒరిగేదేమిటి? ఈ స్కీంను అడ్డుకోవడం సాధ్యపడేపనేనా? ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసించే అధికారం ఎవరికీ లేదు. మహా అయితే ఉప ఎన్నికల దాకా ఆపగలరేమో.. గతంలో దసరా సందర్భంగా పంపిణీచేసే బతుకమ్మ చీరెల పంపిణీని ఆపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడు వరదసాయాన్ని నిలుపుదలచేయించారు. ఏం జరిగింది? ఎన్నికల తరువాత చీరెల పంపిణీ యథాతథంగా కొనసాగింది. వరదసాయమూ బాధితులకు అందింది. ఈ పథకాన్ని కూడా ఎంతకాలం ఆపగలరు? హుజూరాబాద్‌ ఎన్నికే అడ్డంకిగా మారితే.. ఎన్నిక తర్వాత అమలవుతుంది. అంతే తప్ప ముఖ్యమంత్రి సంకల్పాన్ని ఆపగలిగే శక్తి ఎవరికైనా ఉన్నదా? అని పలువురు దళిత నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎన్నికల్లో గెలువలేమనే ఫిర్యాదులు!

ఈ పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేసినప్పటి నుంచి హుజూరాబాద్‌లో బీజేపీ వర్గాల్లో కలకలం రేగుతోంది. అంతేకాదు ఈ పథకాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టు మొదలవుతుందని ప్రకటించినప్పటినుంచి ఈటల అక్కసు వెళ్లగక్కుతున్నారు. పూటకో మాట మాట్లాడుతున్నారు. దళిత బంధు పథకంపై దళిత బిడ్డలకు పూర్తిగా అవగాహన కల్పించేందుకు ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహిస్తే.. దానిపైనా ఆక్రోశించారు. దళితబంధుకు ఎంతైనా ఖర్చు పెడుతామని ముఖ్యమంత్రి ప్రకటించిన 24 గంటల్లోనే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఇతర వ్యక్తులతో ఫిర్యాదు చేయించారు. వెంటనే ఉప ఎన్నికలు పెట్టాలని ఆ ఫిర్యాదులో డిమాండ్‌ చేయించారు. నిన్నమొన్నటి వరకు బీజేపీకి గుర్తుకురాని కేంద్ర ఎన్నికల కమిషన్‌.. దళితబంధు ప్రకటన తర్వాతే ఎందుకు గుర్తుకొచ్చింది? ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం లేకపోతే ఇన్ని నీచ రాజకీయాలెందుకన్న ప్రశ్న తలెత్తుతున్నది. సంక్షేమ పథకాలను ఆపాలనే కుట్రలు ఈరోజు నుంచి కాదు.. హైదరాబాద్‌ ఎన్నికల్లోనూ ఇదే తీరును బీజేపీ అనుసరించింది. ఇప్పుడు అదే కోవలో పయనిస్తోంది. దళితుల జీవన ప్రమాణాలు పెరిగేందుకు ఉపయోగపడే పథకం ఆగాలన్నదే వారి ఆకాంక్షలాగా కనిపిస్తున్నది. దళిత బంధు పథకం ఈటల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది. దీంతో.. ఎలాగైనా ఈ పథకం ఆపాలన్న ప్లాన్‌లో బీజేపీ ఉన్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు చేసిన ఫిర్యాదుతో స్పష్టమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దళిత బంధును కించపరిచిన బీజేపీ

 • సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు

దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన దళిత బంధు పథకాన్ని కించపరుస్తూ బీజేపీ వికృత చేష్టలకు దిగింది. దీనిపై తెలంగాణ ప్రైవేట్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ దళిత నాయకులు గంధం రాములు బుధవరం వనస్థలిపురం పోలీసులకు పిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్‌ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, దళితులను కోళ్లుగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దళిత సమాజాన్ని అవమానపరిచిన బీజేపీ నాయకులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. దళితులను అవమాన పరిస్తే బీజీపే కార్యాలయాలను ముట్టడిస్తామని, ఆ పార్టీ నేతలను ఎక్కడకక్కడే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత గిరిజననాయకులు దస్రు నాయక్‌, మోహన్‌నాయక్‌, గణేశ్‌ మాదిగ, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌, బోధన్‌ ఎమ్మెల్యేలపై అభ్యంతర పోస్టింగ్‌లు

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ యువత గ్రూపులో సీఎం కేసీఆర్‌, బోధన్‌ ఎమ్మెల్యే మహమ్మద్‌ షకీల్‌పై అసభ్యకరంగా పోస్టింగ్‌ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఆర్‌ఎస్‌ బోధన్‌ కార్మిక విభాగం అధ్యక్షుడు ఎన్‌ రవిశంకర్‌ గౌడ్‌ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తిపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో రవిశంకర్‌ గౌడ్‌తో పాటు శ్రీనివాస్‌, శివకుమార్‌ ఉన్నారు.

ప్రస్తుతం ఎన్నికలు లేవు

ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేవు. ఎన్నికల సంఘానికి ఎలాంటి పాత్రా లేదు. అధికార పరిధి లేదు. రాష్ట్ర ప్రభుత్వ పనిలో జోక్యం చేసుకోవాలంటూ ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌కు చెందిన పద్మనాభరెడ్డి సీఈసీకి రాసిన లేఖలో పేర్కొనడం బరితెగింపేనని విశ్లేషకులు అంటున్నారు. పేరుకేమో ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌.. చేసేవేమో విజ్ఞత లేని పనులు.. తలాతోకాలేకుండా.. తిర్రితనం.. వెర్రితనంతో వ్యవహరించడమేనని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎలాంటి ఎన్నికలు లేని సమయంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని జోక్యం చేసుకోవాలని కోరడమంటే.. రాజ్యాంగాన్ని.. చట్టాలను.. ఉల్లంఘించాలని బాజాప్తా చెప్తున్నట్టే కదా! అని విమర్శకులు ముక్కున వేలేసుకొంటున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana