హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. మంత్రుల భిన్న ప్రకటనలతో ఈ విషయం తేటతెల్లమైంది. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నదీ పరీవాహక ప్రాంతంలోని పేదల ఇండ్లను విడతల వారీగా కూల్చివేసింది. ప్రభుత్వ తీరును నాడు బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కూల్చివేతల ప్రాంతంలో ఆ పార్టీ నేతలు ప ర్యటించారు.
బాధితులను పరామర్శించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఏకంగా ఇండ్లు కూల్చిన ప్రాంతంలో నిద్రచేశారు. సుందరీకరణ పేరుతో రూ. 1.5 లక్షల కోట్లు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి నేతల తీరు ఇలా ఉంటే ఢిల్లీ నుంచి వచ్చిన మరో కేంద్రమంత్రి మనోహర్లాల్ఖట్టర్ తాజాగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రాజెక్టు పూర్తికి సహకరిస్తామని పేర్కొన్నారు. నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. దీంతో బీజేపీ ద్వంద్వ వైఖరి బయటపడింది.
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షా యాభైవేల కోట్లతో మూసీని సుందరీకరిస్తామంటూ పరీవాహక ప్రాంతంలోని వందల ఇండ్లను కూల్చివేసింది. కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా నాడు బీఆర్ఎస్ పోరాడింది. అది చూసి బీజేపీ నేతలు కూడా నిరసనలు, ధర్నాలు చే శారు. సుందరీకరణ అంతా బూటకమని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్య క్తంచేశారు. మరో మంత్రి కిషన్‌రెడ్డి ఏకంగా పరీవాహక బాధిత ప్రజల ఇండ్లలో రాత్రి నిద్ర చేశారు. మూసీ ప్రక్షాళన చేయకుండా, ఇండ్లు కూల్చకుండా అడ్డంగా పడుకుంటామని ప్రగల్బాలు పలికారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు నిరసనలు, ధర్నా లు చేపట్టారు. అయితే, మనోహర్‌లాల్ ఖట్ట ర్ వ్యాఖ్యలతో ఇదంతా ప్రజలను మోసం చేసేందుకేనని స్పష్టమైంది.
తెలంగాణకు వచ్చిన మంత్రి ఖట్టర్ మూసీ సుందరీకరణకు కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. దీంతో పైకి ప్రత్యర్థి పార్టీగా నటిస్తూ లోలోపల కొనసాగిస్తున్న కాంగ్రెస్-బీజేపీ స్నేహా న్ని బహిరంగంగా వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలతో ఎంఐఎం-కాంగ్రెస్-బీజేపీ స్నేహం ఇప్పటికే బయటపడింది.