హైదరాబాద్, ఫిబ్రవరి8 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నదని, ఫలితంగా కొన్ని ఉప కులాలకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదమున్నదని భీమ్ ఆర్మీ రాష్ట్ర చీఫ్ వనం మహేందర్ తెలిపారు. వర్గీకరణ తీరును పునఃసమీక్షించాలని, లోపాలను సవరించి అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన హైదరాబాద్లోని భీమ్ ఆర్మీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ‘రేవంత్ సర్కార్ చేపట్టిన ఎస్సీ వర్గీకరణలో అనేక లోపాలున్నాయి.
ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించడం సరైందికాదు. దీని వల్ల కొన్ని ఉప కులాలు మరింత వెనుకపడిపోయే ప్రమాదమున్నది. జనాభా, వెనుకబాటుతనం, అభివృద్ధి అంశాలను ప్రామాణికంగా తీసుకొని వర్గీకరణ చేయాలని సూచించారు. అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుందని మహేందర్ చెప్పారు. ప్రస్తుతమున్న 15 శాతం రిజర్వేషన్ను 18 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు.