హనుమకొండ, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అభివృద్ధి కోసం పనులు చేపట్టడం సహజం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి కోసమే పనులు అన్నట్టుగా సాగుతున్నది. సాగునీటిశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న భద్రకాళీ చెరువు పూడిక పనుల వ్యవహారం ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడానికే అ న్నట్టుగా ఉన్నది. వరంగల్ నగరంలోని చారిత్రక భద్రకాళీ చెరువు సుందరీకరణ పేరుతో ప్రభుత్వం పూడికతీత పనులు ప్ర తిపాదించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పనులకు బదు లు ఎదురు ఖర్చు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భద్రకాళీ చెరువు పూడికతీత పనులు చేపట్టేలా సాగునీటి శాఖ 2024 నవంబర్లో నిర్ణయించింది. 382 ఎకరాల విస్తీర్ణంలోని భద్రకాళీ చెరువులో 18 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక ఉన్నట్టు అంచనా వేసింది.
పూడిక మట్టిని డబ్బులకు విక్రయించేలా ప్రతిపాదనలు సిద్ధంచేసింది. టెండర్ ప్రక్రియలో క్యూబి క్ మీటర్ పూడిక మట్టికి రూ.167 చొప్పు న నిర్ణయించింది. 2025 మార్చి 11న పూడికతీత పనులు మొదలు పెట్టారు. వా నకాలంలోపు పూడిక పనులు పూర్తి చే యాలనే విషయంలో సాగునీటి శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సాగునీటి శాఖ 3.40 లక్షల క్యూబిక్ మీటర్లు, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) 3 లక్షల క్యూబిక్ మీటర్లు కలిపి 6.40 ల క్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీయగా వానకాలం రావడంతో పని ఆగిపోయింది. ఎండాకాలం రావడంతో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో చెరువు పూడిక పనులను కొత్తగా చేపట్టినట్టు సాగునీటి శాఖ పేర్కొంది.
ప్రభుత్వానికి రూ.18 కోట్ల ఆదాయం వచ్చే మట్టి పనిని… కాంట్రాక్టర్కు రూ.16.10 కోట్లు ఎదురు ఇచ్చి పూర్తి చేసేలా మార్చింది. అధికార పార్టీ నాయకులు, అధికారులకు లబ్ధి కలిగేలా నిర్ణయాలు తీసుకున్నది. పూడిక మట్టిని విక్రయించి రూ.18 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే పనులను మధ్యలోనే ఆ పేసి… ఏడాది తర్వాత ప్రభుత్వమే ఖర్చు పెట్టేలా నిబంధలను మార్చింది. చెరువులోని 11 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీ త కోసం రూ.16.10 కోట్లు ఖర్చు పెట్టే లా టెండరు ప్రక్రియ సైతం పూర్తి చేసిం ది. అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఆదేశాలతో కరెంట్ పనులు చేసే ఓ కంపెనీకి చెరువు పూడిక తీత పనులను అప్పగించింది. రెండు వారాలుగా పూడిక తీత పనులు కొనసాగుతున్నాయి.
భద్రకాళీ చెరువులోని పూడికమట్టిని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కుడా ఆధ్వర్యంలోని స్థలాల చదునుకు వి నియోగించాలని టెండర్లో పేర్కొన్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పూడిక మట్టిని ప్రైవేట్ స్థలాలకు తరలిస్తున్నారు. కొన్నేండ్లుగా భద్రకాళీ చెరువు స్థ లాలను కబ్జా చేసి ఇండ్ల ప్లాట్లుగా మార్చి న ప్రదేశాల్లో పూడిక మట్టిని పోస్తున్నారు. రాత్రిపూట వందల లారీల్లో పూడిక మట్టిని కబ్జాచేసిన ప్లాట్లలో పోసి చదును చేస్తున్నారు. జీడబ్ల్యూఎంసీ, కుడా స్థలాలకు ఆనుకుని ఉన్న ప్రైవేట్ స్థలాలకు తరలిస్తున్నారు. కాంట్రాక్టర్ ప్రైవేట్ వ్యక్తులకు మట్టిని అమ్ముకుంటున్నారని సాగునీటి, జీడబ్ల్యూఎంసీ, కుడా అధికారులకు ఫిర్యాదులు అందాయి. చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.