‘ప్రభుత్వం రెండేండ్లుగా నిధులు విడుదల చేయడం లేదు. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. హెచ్చరించినా ఖాతరు చేయడం లేదు. అయినప్పటికీ ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అప్పులు చేసి మరీ పాఠశాలలను నిర్వహిస్తున్నాం. కానీ ఇప్పుడు నిర్వహించలేం. సర్కారు నిధులను విడుదల చేసే వరకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకంలో లబ్ధిదారులైన పిల్లలను పాఠశాలల్లోకి అనుమతించబోం. తల్లిదండ్రులు కూడా పిల్లలను పంపవద్దు’
-బెస్ట్ అవైలబుల్ స్కీమ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్
హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): రెండేండ్లుగా ప్రభుత్వం నుంచి నిధులు రావడంలేదని, పెండింగ్ బకాయిలను సర్కారు చెల్లించేదాకా పాఠాలు చెప్పబోమని బెస్ట్ అవైలబుల్ స్కీమ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ప్రకటించింది. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని వాపోతున్నారు. సర్కారు నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన చిన్నారులకు ఉచిత ప్రైవేట్, కార్పొరేట్ విద్యను అందించేందుకు ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్’ పథకం 17 ఏండ్ల నుంచి అమలవుతున్నది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల ద్వారా నోటిఫికేషన్ జారీచేసి, విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులను సొంత జిల్లా పరిధిలోని ప్రైవేట్ స్కూళ్లల్లో చదివిస్తారు.
ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థులకు 1వ తరగతి, 5వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. గిరిజన విద్యార్థులకు 1, 5, 8వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఎంపికైన ప్రాథమిక తరగతి విద్యార్థికి ఏడాదికి రూ.28,000లు, ప్రాథమికోన్నత తరగతుల విద్యార్థులకు (వసతితో కలిపి) రూ.42,000లు చెల్లిస్తారు. ప్రాథమికోన్నత విద్యను చదివే విద్యార్థి వసతి గృహంలో ఉండడానికి ఇష్టపడకపోతే అతడికి ఫీజుగా రూ.28 వేలు ఇస్తారు. గిరిజన విభాగంలోనూ ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు. ఒకసారి ప్రవేశం పొందితే.. పదో తరగతి వరకు ప్రభుత్వమే ఫీజు చెల్లించడంతోపాటు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం వంటి వాటి సదుపాయాలను ఉచితంగా అందిస్తుంది. అడ్మిషన్ పొందిన పాఠశాలల్లోని ఫీజులను ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల ద్వారా ఫీజులు చెల్లిస్తారు.
బీఏఎస్ కింద రాష్ట్రవ్యాప్తంగా 230 ప్రైవేట్ స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీలు కలిపి 26వేల మంది విద్యార్థులు ఉచితంగా చదువుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 22 నెలలుగా ఈ స్కీమ్‌కు రూ.220కోట్ల నిధులు బకాయి పెట్టింది. దీంతో పాఠశాలల నిర్వహణకు యాజమాన్యాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అడ్మిషన్లను స్వీకరించేందుకు నిరాకరించాయి. నిధులను విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో యాజమాన్యాలు తమ నిర్ణయాన్ని విరమించుకున్నాయి. అయినప్పటికీ సర్కారు మాత్రం బకాయిలు విడుదల చేయలేదు. పాఠశాల యాజమాన్యాలు పోరుబాట పట్టాయి.
దసరాకు ముందు కూడా హెచ్చరించాయి. పండుగ నాటికి నిధులను విడుదల చేయకుంటే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను పాఠశాలలకు అనుమతించబోమని ప్రభుత్వానికి తెగేసి చెప్పాయి. అయినప్పటికీ రేవంత్‌రెడ్డి సర్కారులో చలనం లేకుండా పోయింది. దీంతో పిల్లలను పంపవద్దని తల్లిదండ్రులకు స్కూళ్ల మేనేజ్మెంట్స్ నోటీసులను పంపాయి. ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైందని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తమ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగొచరంగా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తుననారు. సర్కారు తక్షణం స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు.