అమరచింత, నవంబర్ 1 : మానవ త్వం మంటకలిసింది.. అప్పుడే పుట్టిన ఆడశిశువును కర్కశంగా ముళ్లపొదల్లో వదిలేసిన హృదయ విదాకర ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. అమరచింత మండలం క్రిష్ణంపల్లి గ్రామ శివారులోని ముళ్ల పొదల్లో గురువారం రాత్రి 10 గంటల తర్వాత అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. అర్ధరాత్రి తర్వాత చంద్రఘడ్ స్టేజీ శివారులో గొర్రెల మందను నిలిపి ఇంటికి వెళ్తున్న గొర్రెల కాపరులకు శిశువు ఏడుపు వినిపించినా కుక్క పిల్ల అరుపు అనుకొని అక్కడి నుంచి వెళ్లారు.
శుక్రవారం ఉదయం వరకు రోదిస్తుండటంతో అటుగా వెళ్తున్న వారు గుర్తించి స్థానికులకు సమాచారం అందించడంతో శిశువును అక్కున చేర్చుకున్నారు. శరీరమంతా చీమలు పట్టి కందిపోయింది. స్థానికులు, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో శ్రీనివాసులు, ఐసీడీఎస్ సూపర్వైజర్ నర్మదకు సమాచారం అందించారు. ఆత్మకూరు ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షల అనంతరం జిల్లా కేంద్రంలోని శిశు విహార్‌కు తరలించారు.