హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): అనర్హులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు, ప్రభుత్వ పథకాలు అందడంపై సోమవారం అసెంబ్లీలో వాడీవాడీ చర్చ జరిగింది. బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ఓవర్సీస్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ఇతర స్కాలర్షిప్ పథకాలు అనర్హులకు అందుతున్నాయని ఆరోపించారు. ఓ వ్యక్తికి ఇల్లు, లగ్జరీ కార్లు, బైక్లున్నా ఓవర్సీస్ స్కాలర్షిప్ అందినట్టు తమ సర్వేలో తేలిందని మండిపడ్డారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఈడబ్ల్యూఎస్, ఈబీసీ సర్టిఫికెట్లను జారీచేస్తున్నారని, దీంతో అర్హులైన వారికి అన్యాయం జరుగుతున్నదని ఆరోపించారు.
తమ పదేండ్ల పాలనలో నిబంధనల ప్రకారం నడుచుకున్నామని, కఠినంగా వ్యవహరించామని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టంచేశారు. ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నవాళ్లు సైతం పేదవాళ్లుగా చెలామణి అవుతున్నారని, దీంతో అసలు పేదలకు అన్యాయం జరుగుతున్నదని ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. స్కాలర్షిప్లు, పథకాలు అనర్హులకు అందుతుండటం గర్హనీయమని, దీనిపై అఖిల పక్షాలతో సమగ్ర చర్చ జరగాలని సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు అభిప్రాయపడ్డారు.