హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : సీపీఎస్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్(సీపీఎస్ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. రెండేండ్లు గడిచినా పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తంచేశారు. సీపీఎస్ ఉద్యోగుల డీఏ, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ఈయూ ఆధ్వర్యంలో శనివారం అబిడ్స్‌లోని బీమాభవన్ ముందు పోరు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. రెండేండ్లు గడిచింది సారూ.. డీఏలు, పెండింగ్ బిల్లులు ఇంకెప్పుడిస్తారని ప్రశ్నించారు.
సీపీఎస్ రద్దుచేసి, పా త పింఛన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నెలకు రూ. 700కోట్లు పెండింగ్ బిల్లులు విడుదల చేస్తున్నా.. సీపీఎస్ ఉద్యోగులకు రూ. 100కోట్లు కూడా అందడంలేదని వాపోయారు. పోరు దీక్షలో సీపీఎస్ఈయూ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు, శ్యామ్‌సుందర్, పవన్, సత్యనారాయణ, శ్రీనివాసరావు, వెంకటేశ్, శ్రావణ్, చంద్రకాంత్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.