ఖమ్మం, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని, 2014 ఎన్నికలకు ముందు ఊరూరా తిరిగి చెప్పిన నరేంద్రమోదీ వాటిని ఎందుకు అమలు చేయడం లేదో రైతులకు వివరించాలన్నారు. బుధవారం ఖమ్మం సీపీఎం కార్యాలయంలో వామపక్ష నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలతో రైతుల పరిస్థితి ఎలా దయనీయంగా మారుతుందో, వ్యవసాయానికి రైతులు ఎలా దూరం కానున్నారో కళ్లకు కట్టినట్టు తెలియజేసేందుకు, అక్టోబర్ 2న ‘రైతన్న’ సినిమా విడుదల చేస్తున్నామన్నారు. వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతు సంఘాలు చేస్తున్న ఆందోళన జాతీయ స్థాయిలో బంద్కు పిలుపునివ్వడంతో చట్టాలు రైతులను ఎంత ఇబ్బందికి గురిచేస్తున్నాయో స్పష్టమవుతుందన్నారు.