Ponguleti Srinivas Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ): మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని ఖమ్మం కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన అవసరం పార్టీకి ఏమాత్రం లేదని, ఆయన మాకొద్దని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో కార్యకర్తలు పొంగులేటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రేణుక చౌదరి సమక్షంలోనే నినాదాలు చేయడం గమనార్హం. ఒకవేళ తమ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఆయన్ను పార్టీలో చేర్చుకుంటే భవిష్యత్తులో అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు తేలడంతో పొంగులేటిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
అప్పటినుంచి ఆయన ఇతర పార్టీల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. ఆయన్ను పార్టీలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ కీలక నేతలు సైతం పొంగులేటి చేరికపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా రేణుకాచౌదరి.. పొంగులేటి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. సోమవారం ఖమ్మం సభలో ఆమె మాట్లాడుతుండగానే కార్యకర్తలు పొంగులేటికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఇందుకు బలం చేకూరుస్తున్నది.