HYDRA | గత నెల 19వ తేదీన హైడ్రా ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు (జీవో 99) జారీ చేసింది. అందులో స్పష్టంగా ‘పరిధి’ని పేర్కొంది. అవుటర్ రింగు రోడ్డును సరిహద్దుగా నిర్ధారిస్తూ.. అందులోకి వచ్చే పట్టణ, గ్రామీణంలోని స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీల పేర్లను కూడా పొందుపరిచింది. అయితే జంట జలాశయాల ఎఫ్టీఎల్ పరిధుల్లో ఉన్నాయంటూ ఈ నెల 18వ తేదీన హైడ్రా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్‌తో పాటు మొయినాబాద్ మండలంలోని అప్పోజీగూడ, చిలుకూరు, హిమాయత్‌నగర్ పరిధుల్లో పలు భారీ నిర్మాణాలను కూల్చివేసింది.
వాస్తవానికి ఈ గ్రామాలన్నీ అవుటర్ రింగు రోడ్డు బయట ఉన్నాయి. అంటే ప్రభుత్వ ఉత్తర్వుల్లో పొందుపరిచిన పరిధిని దాటి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఖానాపూర్ అంటే అవుటర్ లోపల ఉన్న నార్సింగి మున్సిపాలిటీ పరిధి అని సమర్ధించుకుంటున్నారు.
కానీ అప్పోజీగూడ, చిలుకూరు, హిమాయత్‌నగర్ వేటికవే స్వతంత్ర గ్రామపంచాయతీలతో పాటు అవుటర్ వెలుపల ఉండటంతో హైడ్రా అడుగులపై అనుమానాలు మొదలయ్యాయి. అవి అక్రమ నిర్మాణాలే కావచ్చుగానీ హైడ్రా ఎందుకు పరిధి దాటి వాటిని కూల్చివేయాల్సి వచ్చిందనేది సామాన్యుడిలోనూ సందేహాన్ని రేకెత్తించింది. అదే రాజకీయ మలుపునకు కారణమైంది.