హైదరాబాద్, నవంబర్ 15(నమస్తే తెలంగాణ) : దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఫొటో ఫెస్టివల్(ఐపీఎఫ్) 11వ ఎడిషన్‌ను నవంబర్ 20 నుంచి జనవరి 4 వరకు మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించనున్నారు. ఫొటో జర్నలిజం నుంచి లలిత కళల వరకు, డాక్యుమెంటరీ నుంచి ల్యాండ్‌సేప్ వరకు ప్రపంచవ్యాప్తంగా అద్భుత ఫొటో, డాక్యుమెంటరీ దృశ్యాలను ఈ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. ఈ సంవత్సరం హైదరాబాద్‌లో నిర్వహించే ఐపీఎఫ్ ఎడిషన్‌లో సోలో ఎగ్జిబిషన్లు, గ్రూప్ షోకేస్‌లు, ఆర్టిస్ట్టాక్స్, వర్షాప్లు, డాక్యుమెంటరీ ఫిల్మ్ స్రీనింగ్లు ఉంటాయి.
జెన్నిఫర్ ఆల్ఫోన్స్ దర్శకత్వం వహించిన నాగోబా జాతరతోపాటు అనేక అంశాలపై డాక్యుమెంటరీల ప్రదర్శన ఉంటుంది. 20న సాయంత్రం 5:30 గంటలకు ఐపీఎఫ్-2025 ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ఫెస్టివల్లో పాల్గొనేందుకు ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, మరిన్ని వివరాలకు www. indianphotofest.com అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన సూచించారు. ఈ ఫెస్టివల్‌కు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి 820 ఎంట్రీలు వచ్చాయి.
ఈ సందర్భంగా జరిగే ప్రధాన ఫొటో ప్రదర్శనలో శాశ్వత ముసుగులు-అలెశాండ్రో సెలాంటే(బ్రెజిల్), రెయిన్లడాగ్స్-రోహిత్ చావ్లా (ఇండియా), బెటర్డేస్-సెంగు కిమ్(దక్షిణ కొరియా), మురీవాటర్స్ ది కారవాన్10- పళనికుమార్(ఇండియా), సుడాన్ యుద్ధ సమయంలో- గైల్స్ క్లార్(యూకే), లింగరింగ్ షాడోస్-నజానిన్ అలిపూర్ జెడ్డీ(ఇరాన్), స్లాష్ అండ్ బర్న్-గ్లోరియానా జిమెండాజ్ (కోస్టారికా), ఫ్రంట్ లైన్స్ ఆఫ్ డిగ్నిటీ-మేరీలిస్ విగ్నేయు(ఫ్రాన్స్), నో మ్యాన్స్ ల్యాండ్-ఎలే సోలియర్స్(బెల్జియం), టాబూతో వంట-హృదయ సదానంద్(ఇండియా) ఉన్నాయి.