హనుమకొండ, డిసెంబర్ 11: అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుపెట్టి సీఎం రేవంత్‌రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఆయన హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడారు.
ఆర్టికల్ 14 ప్రకారం ఆయా రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అన్ని రాష్ర్టాలకంటే ముందు తెలంగాణలో వర్గీకరణ చేస్తామని, మాయమాటలు చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి పాత రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
మాదిగలు చాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి.. చెప్పేదొకటి చేసేదొకటని మండిపడ్డారు. సీఎం రెండునాలుకల ధోరణితో మాల, మాదిగల మధ్య దూరం పెంచుతున్నాడని ఆరోపించారు. కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపితే నాడు బీజేపీ తాత్సారం చేసిందని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు సుధీర్‌కుమార్, సరితారెడ్డి పాల్గొన్నారు.