Jagadish Reddy | నిత్యం కేసీఆర్ నామస్మరణ చేస్తున్నదే సీఎం రేవంత్ రెడ్డి అని జగదీశ్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రజల మనసుల్లో ఉన్నారని తెలిపారు. నరసింహస్వామిలాగా ఎప్పుడూ కేసీఆర్ బయటకు వస్తారో అని రేవంత్ రెడ్డి భయపడుతున్నారని పేర్కొన్నారు. నల్గొండలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి రూపు రేఖలు మార్చడంపైనా విమర్శలు గుప్పించారు. అది తెలంగాణ తల్లి విగ్రహం కాదని.. కాంగ్రెస్ మాత విగ్రహమని అన్నారు. కాంగ్రెస్ మాత విగ్రహాన్ని సెక్రటేరియట్లో పెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కావాలంటే ఆ విగ్రహాన్ని గాంధీ భవన్లో పెట్టుకోవాలని సూచించారు.
దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వెనుకబడిందని జగదీశ్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో జిల్లాను సస్యశ్యామలం చేసినందుకు గర్వపడుతున్నానని అన్నారు. 2014లో ఉన్న 7వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 24వేల మెగావాట్లకు పెంచిన ఘనత కేసీఆర్‌దే అని కొనియాడారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను అడ్డుకుంటామని ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రగల్భాలు పలికారని గుర్తుచేశారు. నిన్న జరిగిన ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ఎక్కడ అడ్డుకుంటాడో అని భయపడ్డానని తెలిపారు. పవర్ ప్లాంట్‌ను అడ్డుకోనందుకు కోమటిరెడ్డికి ధన్యవాదాలు అని ఎద్దేవా చేశారు. మెడికల్ కాలేజీ, బ్రాహ్మణవెల్లంల లకు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నిధులు మంజూరు చేసినట్లు జగదీశ్ రెడ్డి తెలిపారు. .
కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు ఏం లాభం జరగలేదని.. మంత్రుల జేబులు మాత్రం నిండాయని జగదీశ్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో 5 లక్షలకు పైగా బోరుబావులు ఉన్నాయని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన ఉచిత కరెంటుతో అధికంగా లాభపడ్డది నల్లగొండ జిల్లానే అని చెప్పారు. అదే కాంగ్రెస్ ఏడాది కాలంలో రైతుబంధు, బీమా, రుణమాఫీలో నల్గొండ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. రాష్ట్రంలో రైతులకు ఎగ్గిట్టింది 30 వేల కోట్లు అయితే.. ఇచ్చింది కేవలం 12 వేల కోట్లు మాత్రమే అని తెలిపారు. ఎక్కడా పూర్తిగా రుణమాఫీ జరగలేదని అన్నారు. దీన్ని లెక్కలతో సహా బయటపెడతానని స్పష్టం చేశారు. నల్గొండలో సీఎం పర్యటనలో మూడు బూతులు ఆరు ఏతులు తప్పా ఇంకోటి లేదని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. తమ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గతేడాది ట్రయల్ రన్ చేసిన దాన్నే.. సీఎం రేవంత్ రెడ్డి నిన్న మళ్లీ ట్రయల్ రన్ చేశారని తెలిపారు.
కేసీఆర్ హయాంలో చేపట్టి పూర్తికావచ్చిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, మెడికల్ కాలేజీ, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తాము శంకుస్థాపన చేసిన పథకాలనే కాంగ్రెస్ నాయకులు ఓపెన్ చేస్తున్నారని జగదీశ్ రెడ్డి తెలిపారు. కొత్తగా ఒక్క పని చేసే సత్తా కాంగ్రెస్ నాయకులకు లేదని అన్నారు. దమ్ముంటే శంకుస్థాపనలు చేసి.. పనులు పూర్తి చేయాలని సవాలు విసిరారు. దీనిపై మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వేటాడుతానని అన్నారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని తెలిపారు. ఏడాది పాలనలో కాంగ్రరెస్ నాయకుల జేబులు మాత్రమే నిండాయని విమర్శించారు.