హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ): మీకెన్నిసార్లు చెప్పాలి? స్థలాలు ఖాళీ చేయాలని చెప్తే తమాషాలు చేస్తున్నారా? ఒకట్రెండురోజుల్లో మొత్తం ఖాళీ చేయాలి. లేకపోతే లాఠీచార్జి చేసైనా వెళ్లగొడ్తం. చెరువు దగ్గర జాగా ఎందుకు కొన్నరు? కోర్టు ఆర్డర్లు ఉంటే నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు. ఎక్కడైనా చెప్పుకోండి. మీరు ఖాళీ చేసి పోవాల్సిందే. ఇక్కడనే ఉంటామంటే బొక్కలో వేసి, బొక్కలు ఇరగ్గొడ్తం ఇదీ సున్నంచెరువు వద్ద స్థానికులపై హైడ్రా అధికారులు చేసిన వ్యాఖ్యలు. దీంతో దిక్కుతోచని స్థితిలో స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మాదాపూర్ సున్నంచెరువు సమీపంలోని నిర్మాణాలను నిరుడు సెప్టెంబర్ 8న హైడ్రా అధికారులు కూల్చివేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లో సామాగ్రి బయటకు తీసుకోనివ్వకుండా, వర్షం పడుతున్నా అందరినీ కట్టుబట్టలతో ఇండ్లలో నుంచి బయటకు పంపి, కట్టడాలు కూల్చివేశారు. తామెక్కడకి వెళ్లాలో తెలియక, కూల్చివేతల శిథిలాల మధ్యే బాధితులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. పదినెలలుగా హైడ్రా, సున్నంచెరువు బాధితుల మధ్య వివాదం కొనసాగుతున్నది. కూల్చివేతల తర్వాత తమకు కరెంట కట్ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి, అధికారుల నుంచి కరెంట్ ఇస్తామనే హామీ తీసుకోగానే హైడ్రా అధికారులు వచ్చి అడ్డుకుంటున్నట్టు చెప్పారు.
చందానగర్ సర్కిల్లో ఉంటున్న తమకు ఇండ్ల్లనంబర్లు కూడా ఉన్నాయని, ఇప్పుడు హైడ్రా అధికారులు, సిబ్బంది వచ్చి తమను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారంటూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో సున్నంచెరువును సర్వేచేసి హద్దులు నిర్ణయించేవరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని, పిటిషనర్ల ఇండ్లను కూల్చవద్దని, న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఈ మేరకు పలుశాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను హైడ్రా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడురోజుల క్రితం హైడ్రా ఇన్స్పెక్టర్ వచ్చి ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ ఒత్తిడి చేశాడని తెలిపారు.
ఈనెల 4న హైడ్రా కమిషనర్ రంగనాథ్ సున్నంచెరువును పరిశీలించి వెళ్లారు. ఆ మరుసటిరోజే హైడ్రా ఇన్స్పెక్టర్, కొందరు అధికారులు గుట్టల బేగంపేటకు వచ్చి తమను ఖాళీ చేయాలని బెదిరించినట్టు బాధితులు చెప్తున్నారు. ఎన్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నా తాము ఇండ్లను వదిలిపెట్టి వెళ్లబోమని అంటున్నారు. బతుకుదెరువుకోసం కుటుంబాలతో వచ్చామని, పైసాపైసా కూడబెట్టుకుని స్థలాలు కొనుక్కున్నామని చెప్పారు. ప్రత్యామ్నాయం చూపించకుండా ఖాళీ చేయమంటే ఎలా చేస్తామంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.